భారత్‌తో నాది విడదీయరాని బంధం : అంగ్‌సాన్‌్‌సూకి

 

న్యూఢిల్లీ, నవంబర్‌ 14 (జనంసాక్షి):

ప్రపంచ ప్రఖ్యాత గాంచిన మయన్మార్‌ ప్రజాస్వామ్య నేత ఆంగ్‌ సాన్‌ సూకీ నాలుగు దశాబ్దాల తర్వాత భారతదేశాన్ని సందర్శిం చారు. మయన్మార్‌ సైనిక ఉక్కుపిడికిలిలో ఇనాళ్ళు బందీ అయిన ఈ శాంతికపోతం స్వేచ్ఛా వాయువును పీల్చుకుని 40ఏళ్ళ తర్వాత సోనియా గాంధీ ఆహ్వానం మేరకు భారతదేశాన్ని సందర్శించడం విశేషం. మంగళవారం నాడు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి చేరుకున్న ఆంగ్‌ సాన్‌ సూకీకి ఘనంగా స్వాగతం పలికి భారతీయులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహాత్మా గాంధీ ఫొటోలతో పాటు, ఆంగ్‌సాన్‌సూకీ ప్లే కార్డులను జత కలిపి స్వాగతం పలకడం విశేషం. యూపిఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ చైర్మన్‌గా వ్యహరిస్తున్న జవహర్‌లాల్‌ నెహ్రూ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన వ్యక్తగా ప్రసంగించేందుకు సూకీ భారతదేశానికి వచ్చారు. 2012లో ప్రధాని మన్మోహన్‌ మయన్మార్‌ను సందర్శించినప్పుడు సూకీని తమ దేశంలో పర్యటించవలసిందిగా ఆహ్వానం పలికి ఉన్నారు. వాస్తవానికి 1992లోనే సూకీ భారతదేశానికి రావల్సి ఉంది. జవహర్‌లాల్‌ నెహ్రూ ఫౌండేషన్‌ ప్రకటించిన అవార్డును స్వీకరించడానికి 1992లో రావల్సి ఉండగా, మయన్మార్‌ ప్రభుత్వం విధించిన గృహ నిర్భందంలో ఉండటం వల్ల సూకీ ఆనాడు ఈ అవార్డును స్వీకరించలేకపోయారు. సూకీకి భారతదేశంతో ఎనలేని బాంధవ్యం ఉంది. సూకీ తల్లి డాకీన్‌హీ భారత దేశ అంబాసిడర్‌గా వ్యవహరించే కాలంలో బాల్యంలోని తొలిరోజులు సూకీ ఇక్కడే గడిపారు. తదనంతరం సిమ్లాలో ఉన్నత విద్యనభ్యసించేందుకు 25ఏళ్ళ వయసులో 1987లో ఇక్కడి రెండోసారి వచ్చారు. చిన్నప్రాయంలోనే ప్రజా స్వామ్య భావాలను తండ్రి నుండి పుణికి పుచ్చుకున్న ఆంగ్‌ సాన్‌ సూకీ ఈ రోజు మయన్మార్‌లో సైనిక నియంతృత్వం తొలగి బహుళ పార్టీలు ఉన్న ప్రజాస్వామ్య దేశంగా మారేందుకు, అక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారంటే  ఆమె చేసిన అలుపేరగని పోరాటమే. ఇదిలా ఉండగా ఆంగ్‌సాన్‌సూకీ బుధవారం నాడు ఉదయం మహాత్ముని సమాధిని, శాంతి వనంలోని నెహ్రూ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అలాగే, ఆమె తన పర్యటనలో భాగంగా బుధవారంనాడు జవహర్‌లాల్‌ నెహ్రూ మోమొరియల్‌ ఫౌండేషన్‌ కార్యక్రమంలో ప్రసంగించిన అనంతరం ప్రధాని మన్మోహన్‌తో చర్చలు జరిపారు. తదనంతరం ఆమె న్యూఢిల్లీలోని శ్రీరాం కాలేజీలో ఫ్యాకల్టీ సిబ్బంది, విద్యార్థులతో మమేకమవుతారు. తదనంతరం దేశంలోని మహిళల స్వావలంబన స్థితి గతులను పరిశీలించేందుకు సూకీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి గ్రామీణ మహిళలతో కూడా సమావేశం కానున్నారు.