భారత్‌ ఉగ్ర జాబితాకు అమెరికా మద్దతు

– దావూద్‌తో పాటు మరోఇద్దరిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ):  కొత్త యూఏపీఏ చట్టం ప్రకారం మసూద్‌ అజర్‌, హఫీజ్‌ సయీద్‌, దావూద్‌ ఇబ్రహీం, జకీర్‌ ఉర్‌ రహ్మాన్‌ లఖ్వీలను ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం చేసిన ప్రకటనను అమెరికా స్వాగతించింది. భారత నిర్ణయాన్ని మద్దతు ఇస్తున్నట్లు యాక్టింగ్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ ఫర్‌ సౌత్‌ అండ్‌ సెంట్రల్‌ ఆసియా అధిపతి అలిస్‌ వెల్స్‌ ట్వీట్‌ చేశారు. భారత్‌ చేసిన ప్రకటన ఉగ్రవాద నిర్మూలన కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు సహకరిస్తుందని అన్నారు.
యూఏపీఏ (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం)ను సవరించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దానిని బుధవారం ప్రయోగించింది. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్‌ అజర్‌, లష్కరే తాయిబా ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్‌ మహ్మద్‌ సయీద్‌, లష్కరే కమాండర్‌, ముంబై దాడుల సూత్రధారి జకీర్‌ ఉర్‌ రహ్మాన్‌ లఖ్వీ, మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంలను ఉగ్రవాదులుగా కేంద్ర ¬ంమంత్రిత్వశాఖ ప్రకటించింది. వీరు తరచూ ఉగ్రకార్యకలాపాలకు పాల్పడిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పాకిస్థాన్‌కు
చెందిన మౌలానా మసూద్‌ అజర్‌ పలు ఉగ్రదాడులకు నేతృత్వం వహించినట్టు కేంద్రం తెలిపింది. ప్రధానంగా 2001లో పార్లమెంట్‌పై, కశ్మీర్‌ అసెంబ్లీపై దాడులు, 2016లో పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై, 2017లో శ్రీనగర్‌లోని బీఎస్‌ఎఫ్‌ బేస్‌క్యాంప్‌పై, ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడులు చేసినట్టు వెల్లడించింది. మసూద్‌ను ఇప్పటికే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసిందని గుర్తుచేసింది. మరో ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ 2008 ముంబై ఉగ్రదాడులతోపాటు 2000లో ఎర్రకోటపై, యూపీ రాంపూర్‌లోని సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌పై, 2015లో జమ్ముకశ్మీర్‌లోని ఉదంపూర్‌లో బీఎస్‌ఎఫ్‌ కాన్వాయ్‌పై జరిపిన దాడులకు వ్యూహం రచించినట్టు పేర్కొన్నది. అంతేగాకుండా జమాత్‌ ఉద్‌ దవా ఉగ్రసంస్థను నెలకొల్పాడని, అతడిని ఐరాస 2008లోనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిందని పేర్కొన్నది.