భారీగా బ్యాంకింగ్‌ సంస్కరణలకు కేంద్రం యత్నం

– పలు బ్యాంకుల విలీనానికి ప్రభుత్వం పచ్చజెండా
– యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రాబ్యాంక్‌,కార్పోరేషన్‌ బ్యాంకుల విలీనం
– విూడియా సమావేశంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి
న్యూఢిల్లీ,ఆగస్టు 30(జనంసాక్షి):ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇందులో భాగంగానే బ్యాంకుల విలీన పక్రియ వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ను విలీనం చేసి దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఏర్పడనున్నట్లు వెల్లడించారు. కెనరా బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌ను కలిపి నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ  బ్యాంక్‌గా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ను కలిపి ఐదో అతిపెద్ద బ్యాంక్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇండియన్‌ బ్యాంక్‌ను అలహాబాద్‌ బ్యాంక్‌లో విలీనం చేస్తున్నట్లు చెప్పారు. తాజా ప్రకటనతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు తగ్గనున్నట్లు తెలిపారు.ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ చెప్పారు. బ్యాంకింగ్‌, ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని కీలక మార్పులు అవసరమని భావిస్తున్నామని పేర్కొన్నారు.  పీఎన్‌బీ, ఓబీసీ, యునైటెడ్‌ బ్యాంకులు విలీనం కానున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ 3 బ్యాంకుల కలయికతో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఏర్పడుతుందని నిర్మలాసీతారామన్‌ విూడియా సమావేశంలో చెప్పారు. ఈ బ్యాంకు రూ.17.95 లక్షల కోట్లతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు, యూబీఐ ఒకే బ్యాంకుగా ఏర్పడనున్నాయని తెలిపారు. సిండికేట్‌ బ్యాంకులో కెనరా బ్యాంకు విలీనం కానున్నట్లు చెప్పారు. అలహాబాద్‌ బ్యాంకులో ఇండియన్‌ బ్యాంకు విలీనం అవుతుందని..వీటి కలయిక ద్వారా ఐదో అతిపెద్ద బ్యాంకుగా మారుతుందని పేర్కొన్నారు. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వేగవంతమైన పక్రియ అనుసరించబోతున్నాయని తెలిపారు. 59 నిమిషాల్లో లోన్‌ ప్రాసెస్‌ క్లియర్‌ చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బ్యాంకింగ్‌లో రాజకీయ జోక్యాన్ని నిర్మూలిస్తున్నామని, బ్యాంకుల ఎండీల ఎంపికలో రాజకీయాలకు తావులేదన్నారు. ఎస్‌బీఐ తరహాలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ విధానాన్ని.. మిగతా జాతీయ బ్యాంకుల్లోనూ తీసుకొస్తున్నామని నిర్మల వెల్లడించారు. బ్యాంకుల నిరర్థక ఆస్తులు గణనీయంగా తగ్గాయని, 2018 ఆఖరు నాటికి రూ.8.65 లక్షల కోట్లకుపైగా ఉన్న నిరర్థక ఆస్తులు.. ఇప్పుడు రూ.7.9 లక్షల కోట్లకు తగ్గాయని చెబుతున్నారు. ప్రధాని మోదీ హయాంలో ఎగవేతలు పెరిగాయన్న.. విమర్శలకు చెక్‌పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయాబ్యాంక్‌, దేనా బ్యాంకుల విలీనం ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపబోతోందని నిర్మలాసీతారామన్‌ చెప్పారు.  5 ట్రిలియన్‌ కోట్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అనేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సుపరిపాలన దిశగా బ్యాంకులు తమ సేవల్లో మార్పులు చేసుకోవాలని నిర్దేశిరచారు. గృహ, వాహనాల, తనఖా రుణాలను 8 ప్రభుత్వ బ్యాంకులు ప్రారంభించాయి. రుణాల రికవరీలో బ్యాంకులు పురోగతి సాధించాయి. భారీ రుణాలు, మొండిబకాయిలపై పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని నిర్మలాసీతారామన్‌ వెల్లడించారు. 14 ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాలబాటలో పయనిస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు ఇస్తున్న మద్దతును పొడిగిస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ రీఫండ్స్‌ను రానున్న 30 రోజుల్లో క్లియర్‌ చేయాలని, భవిష్యత్తులో 60 రోజుల్లో రీఫండ్స్‌ను విడుదల చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. పరిశ్రమలకు ఊతమిచ్చేలా కేందప్రభుత్వం త్వరలో రెండు కీలక నిర్ణయాలు తీసుకోనుందని చెప్పారు.