భారీ ఉగ్రకుట్ర భగ్నం …

– తొమ్మిది మంది ఉగ్రవాదులను అరెస్ట్‌ చేసిన ముంబై పోలీసులు
– 12బృందాలతో ఏకకాలంలో దాడులు
న్యూఢిల్లీ, జనవరి23(జ‌నంసాక్షి) : గణతంత్ర దినోత్సవ వేడుకలకు సరిగ్గా మూడు రోజుల ముందు ముంబై పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. నరహంతక మూక ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్నట్టు భావిస్తున్న తొమ్మిది మందిని మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్‌) అరెస్ట్‌ చేసింది. నిఘావర్గాల నుంచి సమాచారం సమాచారం అందడంతో గత కొద్ది వారాలుగా ఏటీఎస్‌ అధికారులు ఈ ముఠాపై కన్నేసి ఉంచారు. సంబంధిత సమాచారం సేకరించిన అనంతరం వీరిని బుధవారం ఉదయం మెరుపుదాడి చేసి అరెస్టు చేశారు. ‘మాకు సమాచారం అందే సమయానికే ఈ ముఠా దాడులకు సిద్ధమైందదని, దీంతో ఏటీఎస్‌ మొత్తం డజను బృందాలను ఏర్పాటు చేసి విస్తృత గాలింపు చేపట్టిందని ఏటీఎస్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.  థానే జిల్లాలోని ముంబ్రా, ఔరంగాబాద్‌ సహా ఐదుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి సీజ్‌చేశామన్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు ఈ సోదాలు జరిగాయని ఏటీఎస్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా అరెస్టయిన తొమ్మిదిమంది 17 నుంచి 35ఏళ్లలోపువారే కావడం విశేషం. ఔరంగాబాద్‌ నుంచి నలుగురు, ముంబ్రా, థానే నుంచి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సోదాల సందర్భంగా ఏటీఎస్‌ అధికారులు పలు ప్రమాదకరమైన రసాయనాలు, పౌడర్‌, మొబైల్‌ ఫోన్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, సిమ్‌ కార్డులు, యాసిడ్‌ బాటిల్‌, పదునైన కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైనవారిపై ఐపీసీ 120 (బీ), 19, 20, 38, 39 సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్ట్‌  అయిన వారిలో సల్మాన్‌ ఖాన్‌, ఫహాద్‌ షా, జామెన్‌, మొహసెన్‌ ఖాన్‌, మొహమ్మద్‌ మజార్‌ షేక్‌, టాకి ఖాన్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌, జహీద్‌ షేక్‌గా గుర్తించారు. ఇదిలాఉంటే రిపబ్లిక్‌ డేకు ముందు ఐసిస్‌ కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి.మరోవైపు  గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎటిఎస్‌ గాలింపు చర్యలు చేపడుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా ఎటిఎస్‌ ..నిందితుల సమాచారాన్ని సేకరించి, విచారణ చేపట్టింది. పలు బృందాలు విభజన చేసుకొని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. నిందితుల నుండి రసాయనాలు, పేలుడు పదార్థాలు, మొబైల్‌ ఫోన్లు, హార్డ్‌డ్రైవ్‌, సిమ్‌ కార్డులు వంటి పలు రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఐసిస్‌ మద్దతుదారులని తెలుస్తోంది. ఉగ్రవాదులతో వీరికున్న సంబధాలను ఆరా తీస్తున్నారు.