భార్యకు భర్త బ్యాంకు ఖాతా లావాదేవిలు

 బ్యాంక్‌ తీరుపై ఫోరం జరిమానా
అహ్మదాబాద్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): భర్తకు చెందిన బ్యాంకు ఖాతా లావాదేవీల స్టేట్‌మెంట్‌ ను భార్యకు ఇచ్చినందుకు అహ్మదాబాద్‌ జిల్లా వినియోగదారుల ఫోరం బ్యాంకుకు జరిమానా విధించింది. సర్దార్‌ నగర్‌ హన్సాల్‌ లో ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్రాంచీలో దినేష్‌ అనే వ్యక్తికి పొదుపు ఖాతా ఉంది. దినేష్‌ బ్యాంకు ఖాతా ద్వారా గత మూడేళ్లలో జరిపిన లావాదేవీల వివరాలతో కూడిన స్టేట్‌ మెంట్‌ ను అతని భార్య హర్షిక తీసుకుంది. తన ఆమోదంతోపాటు అధికారిక పత్రం లేకుండానే తన భార్యకు అక్రమంగా తన ఖాతా సమాచారం అందించారని, ఇది రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధమని దినేష్‌ వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. తనకూ, తన భార్య హర్షికకు మధ్య ఏర్పడిన కుటుంబ వివాదం నేపథ్యంలో ఫ్యామిలీ కోర్టులో కేసు నడుస్తుందని, రహస్యంగా ఉంచాల్సిన తన ఖాతా వివరాలను బ్యాంకు అధికారులు తన భార్యకు బహిర్గతం చేశారని దినేష్‌ ఫోరంలో వాదించారు. దీనిపై విచారణ జరిపిన ఫోరం రిజర్వు బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించిన ఇండియన్‌ ఓవర్‌ సీస్‌ బ్యాంకు కు పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ జరిమానా మొత్తాన్ని దినేష్‌ కు చెల్లించాలని ఫోరం ఇచ్చిన తీర్పులో ఆదేశించింది.