మధ్యప్రదేశ్‌,మిజోరంలలో మొదలైన పోలింగ్‌


భారీ ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం
మధ్యప్రదేశ్‌లో ఓటేసిన సిఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌
ఓటేసిన కాంగ్రెస్‌ నేతుల కమల్‌నాథ్‌, జ్యోతిరాదిత్య
న్యూఢిల్లీ,నవంబర్‌28(జనంసాక్షి):  2019 లోక్‌సభ ఎన్నికలకు సెవిూ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల  అసెంబ్లీ  ఎన్నికల్లో భాగంగా బుధవారం మధ్యప్రదేశ్‌, మిజోరంలలో పోలింగ్‌ ప్రాంభం అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు గాను 2,899 మంది అభ్యర్థులు బరిలో నిలువగా ఈసీ 65 వేల పోలింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌లో పోలింగ్‌ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మరోవైపు మిజోరంలోని 40 స్థానాలకు 209 మంది అభ్యర్థులు బరిలో నిలువగా ఈసీ 1,164 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 11న జరగనుంది. పలు చోట్ల ఈవీఎంలు పనిచేయడం లేదని ఫిర్యాదుల వస్తున్న నేపథ్యంలో ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఈసీ ఓటింగ్‌
సమయాన్ని పెంచాలని జ్యోతిరాదిత్య సింధియా కోరారు.  ఉదయం 11 గంటల వరకు మిజోరంలో 29 శాతం, మధ్యప్రదేశ్‌లో 15.58 శాతం ఓటింగ్‌ నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని గుణ, ఇండోర్‌లలో ఎన్నికలు విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కొల్పోయిన ముగ్గురు అధికారుల కుటుంబాలకు ఈసీ పరిహారం ప్రకటించింది.
కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా గ్వాలియర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజల ఆశీస్సులతో డిసెంబర్‌ 11న కాంగ్రెస్‌ పార్టీ మధ్యప్రదేశ్‌లో అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటల వరకు మిజోరంలో 15 శాతం, మధ్యప్రదేశ్‌లో 6.32 శాతం పోలింగ్‌ నమోదైనట్టు సమాచారం. మధ్యప్రదేశ్‌లోని కొన్ని చోట్ల ఈవీఎంలలో సమస్య తలెత్తింది. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తన సొంత నియోజకవర్గం బుధ్నీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ 100 శాతం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 200 సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేశారని తెలిపారు.
మధ్యప్రదేశ్‌, మిజోరంలో తొలి సారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువతి, యువకులు ఉత్సహం కనబర్చారు. మరోవైపు మిజోరం ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు చింద్వారా హనుమాన్‌ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌ ప్రజలపై పూర్తి స్థాయి నమ్మకం ఉందన్నారు. చాలా కాలం నుంచి రాష్ట్రంలోని అమాయక ప్రజలను బీజేపీ మోసం చేస్తూ వస్తుందన్నారు.
మిజోరంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు.
మధ్యప్రదేశ్‌లోని 5.4 కోట్ల మంది నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద 2 లక్షల మంది పోలీసులతో ఈసీ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌లో మూడు దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి కూడా సీఎం పీఠంపై కన్నేసింది. మరోవైపు బీజేపీ వ్యతిరేకతను తమవైపు మలుచుకుని ఎలాగైనా అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్‌ సర్వశక్తులు ఒడ్డింది.  మరికొద్దిసేపట్లో పోలింగ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నర్మద తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  2008, 2013లలో మిజోరంలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. ఈ సారి కూడా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇక్కడ కాంగ్రెస్‌, మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌) మధ్య తీవ్ర పోటీ నెలకొంది.మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇండోర్‌లో భాజపా నేత కైలాశ్‌ విజయవర్గియా గుర్రపు బండిపై వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. భార్య, ఇతర నేతలతో కలిసి కైలాశ్‌ గుర్రపు బండిపై పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటేశారు.