మధ్యప్రదేశ్‌ సీఎంగా..  కమల్‌నాథ్‌ ప్రమాణస్వీకారం


– హాజరైన కాంగ్రెస్‌నేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు
బోపాల్‌, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : మధ్యప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ సోమవారం  ప్రమాణస్వీకారం చేశారు. తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికైన కమల్‌నాథ్‌ రాష్ట్రానికి 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. కమల్‌నాథ్‌కు డిప్యూటీ సీఎంగా జ్యోతిరాదిత్య సింధియా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కర్ణాటక సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడ, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా, శరద్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నేతలు దిగ్విజయ్‌ సింగ్‌, మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సైతం హాజరయ్యారు. గాంధీ, నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో
ఒకరిగా కమల్‌నాథ్‌ గుర్తింపు పొందారు. నవంబర్‌ 18, 1946న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన ఆయన విద్యాభ్యాసం కోల్‌కతాలో జరిగింది. ఆ సమయంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌ గాంధీతో అనుబంధం ఏర్పడింది. అతని ద్వారా గాంధీ కుటుంబానికి కమల్‌నాథ్‌ సన్నిహితులయ్యారు. 1968లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన.. అనంతరం ఇందిర నేతృత్వంలోని కేందప్రభుత్వంలో కీలక వ్యక్తిగా మారారు. 1980లో మొదటిసారి సింద్వారా నుంచి ఎంపీగా ఎన్నిక అయిన ఆయన ఇప్పటి వరకు 9సార్లు అదే నియోజకవర్గం నుంచి లోక్‌ సభకు ప్రాతినిధ్యం వహించారు. యూపీఏ హయాంలోనూ కేంద్రమంత్రిగా పనిచేశారు.