మమత ర్యాలీకి సంఘీభావం తెలిపిన రాహుల్‌

– ప్రతిపక్షాలన్నీ సమైక్యంగా ఉన్నాయి

– లేఖలో వెల్లడించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌

కోల్‌కతా, జనవరి18(జ‌నంసాక్షి) : తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రతిపక్షాల సమైక్యతను చాటేందుకు నిర్వహిస్తున్న సభకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మద్దతు పలికారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ శనివారం సమైక్య భారత్‌ పేరిట కోల్‌ కతాలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో 40లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ర్యాలీకి ఏపీ సీఎం చంద్రబాబుతో సహా పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీయేతర నేతలు పాల్గొంటున్నారు. కాగా ఈర్యాలీకి కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌, సోనియాలు పాల్గొనడం లేదు. కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, అభిషేక్‌ మను సింఘ్వి హాజరవుతారని ఆ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ శుక్రవారం మమతకు లేఖ రాశారు. ఈ లేఖలో ర్యాలీకి సంఘాభావం ప్రకటించారు. ప్రతిపక్షాలన్నీ సమైక్యంగా ఉన్నాయన్నారు. సమైక్యతను చాటేందుకు మమత

చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు. మనమంతా కలిసి సమైక్య భారత దేశం సందేశాన్ని శక్తిమంతంగా పంపించగలమన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బలమైన శక్తులు సమాయత్తమవుతున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న అబద్ధాలు, తప్పుడు హావిూల వల్ల ఆగ్రహంతో, నిరుత్సాహంతో ఉన్న లక్షలాది మంది భారతీయులు ప్రేరేపించిన శక్తులు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. నవ్య భవిత పట్ల ఆశావాద దృక్పథంతో ఈ శక్తులు ముందుకెళ్తున్నాయన్నారు. ప్రతి పురుషుడు, ప్రతి మహిళ, ప్రతి బిడ్డ వినిపించే గళాన్ని వినే భారతదేశ భావం నిండిన భవితపట్ల ఆశావాదం నడిపిస్తోందన్నారు. మతం, ఆర్థిక స్తోమత, ప్రాంతం వంటివాటితో సంబంధం లేకుండా గౌరవ భావం నిండిన భవిత పట్ల ఆశావాదం నడిపిస్తోందని రాహుల్‌ పేర్కొన్నారు.