మయన్మార్‌లో మానవహక్కుల ఉల్లంఘనలపై ఒబామా మండిపాటు
మయన్మార్, నవంబర్19: ఎట్టకేలకు పెద్దన్న స్పందించాడు..గత కొద్ది రోజులుగా మయన్మార్‌లో మానవహక్కుల ఉల్లంఘనలపై ఇంతవరకూ నోరు విప్పని అగ్రరాజ్యం అమెరికా అధినేత తొలిసారిగా మయన్మార్‌లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలను ఖండించాడు..ఏషియాన్ సదస్సులో పాల్గొనడానికి మయన్మార్‌లో పర్యటించిన ఆయన రోహింగ్యా తెగ ఊచకోతపై నోరువిప్పాడు..మయన్మార్‌లో వారిపై జరుగుతున్న దారుణమారణ కాండపై మండిపడ్డాడు. మయన్మార్‌లో పర్యటించిన తొలి అమెరికా అధినేతగా చరిత్ర సృష్టించిన ఆయన అంతటితో ఆగకుండా బర్మాలో అమెరికా రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రపంచంలో అందరికీ జీవించే హక్కు ఉందని, రోహింగ్యా తెగ ముస్లీంల జీవించే హక్కులను అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక తెగ లక్ష్యంగా చేసుకొని దారుణమారణ కాండ సాగించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. గత కొద్ది రోజులుగా రోహింగ్యా తెగ ముస్లీంలను ఊచకోత కోస్తున్నారని ఇది దారుణమన్నారు. నియంతృత్వం నుంచి బర్మా ప్రజాస్వామ్యం వైపు వెళ్లాలని ఒబామా సూచించారు. ఈ సందర్భంగా ఆయన మయన్మార్ ప్రెసిడెంట్ థియాన్‌సేన్‌ను కలిసి ఈ మేరకు సూచనలు చేశారు. బర్మాలోని ప్రతిష్టాత్మక రంగూన్ యూనివర్శిటీలో ప్రతిపక్షనేత, ప్రజాస్వామ్య నేత అంగ్‌సూన్‌సూకీతో కలిసి ప్రసంగించారు. ప్రజాస్వామ్యం వైపు బర్మా పరుగులు పెట్టాలని, నియంతృత్వపు సంకెళ్లను తెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మయన్మార్‌లో అమెరికా రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాడు. రోహింగ్యా తెగ ముస్లీంల ఊచకోతపై గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు జరుగుతన్న విషయం తెల్సిందే. అయితే ఇంతవరకూ మౌనంగా ఉన్న ఒబామా ఇపుడు మయన్మార్‌లో పర్యటించాల్సి రావడంతో నోరు విప్పక తప్పలేదని విశ్లేశకులు భావిస్తున్నారు.