మయన్మార్‌లో హిందువులను సైతం వదలని సైన్యం

– హింసలో 86 మంది హిందువుల మృతి

– రొహింగ్యాలతో కలిసి బంగ్లాదేశ్‌కు చేరుకున్న 500 మంది హిందువులు

– బంగ్లాదేశ్‌ శరణార్థి శిబిరాలకు పెరుగుతున్న వలసలు

– గత పది రోజుల్లో 87 వేల మంది రొహింగ్యాల వలస

– బంగ్లా శిబిరాల్లో 4 లక్షల మంది రొహింగ్యాలు

కాక్స్‌బజార్‌/న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 5(జనంసాక్షి): మయన్మార్‌లో చెలరేగిన ఈ హింసలో 86 మంది హిందువులు మృతి చెందడంతో దాదాపు 500 మంది హిందువులు రోహింగ్యాలతో కలసి బంగ్లాదేశ్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మయన్మార్‌ సైన్యం దాడుల నేపథ్యంలో పదుల సంఖ్యలో రోహింగ్యాలు బుల్లెట్‌ గాయాలతో కాక్స్‌బజార్‌లోని సదర్‌ హాస్పిటల్‌లో చేరినట్లు వైద్యాధికారి షాహిన్‌ అబ్దుర్‌ రెహ్మన్‌ చౌధురీ తెలిపారు. బ్రిటిష్‌ వారి హయాంలో అప్పటి అవిభక్త బెంగాల్‌ నుంచి వెళ్లి మయన్మార్‌లోని రఖైన్‌ రాష్ట్రంలో స్థిరపడ్డ రోహింగ్యా ముస్లింలను పౌరులుగా గుర్తించడానికి మయన్మార్‌ పాలకులు నిరాకరిస్తూనే వచ్చారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో 4 లక్షల మంది రోహింగ్యాలు ఆశ్రయం పొందుతున్నారు.హింస కారణంగా గత పది రోజుల్లోనే దాదాపు 87,000 మంది రోహింగ్యా ముస్లింలు రఖైన్‌ రాష్ట్రం నుంచి బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. సరిహద్దుల గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించడానికి మరో 20 వేల మంది సిద్ధంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. మయన్మార్‌ ఆర్మీకి, రోహింగ్యా తీవ్రవాదులకు మధ్య జరుగుతున్న హింస వల్ల ఈ వలసలు మరింతగా పెరిగే ప్రమాదముందని ఐరాస హెచ్చరించింది.భారీ వర్షాలకు నిలువనీడ లేక బంగ్లా ప్రభుత్వం ఏర్పరచిన శిబిరాల సవిూపంలోనే రోహింగ్యాలు అందరూ కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.ఇదిలాఉండగా, భారత్‌లో నిరాశ్రులై ఆశ్రయం పొందుతున్న రోహింగ్యా ముస్లింలను మయన్మార్‌కు తిప్పిపంపే విషయంలో తమ అభిప్రాయాన్ని తెలపాలని సుప్రీం కోర్టు సోమవారం కేంద్రాన్ని ఆదేశించింది. రోహింగ్యాలను తిప్పిపంపాలన్న కేంద్రం నిర్ణయాన్ని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సవాల్‌ చేశారు.ముస్లింలలో ప్రత్యేక తెగకు చెందిన సుమారు 10లక్షలమంది రోహింగ్యాలు తరతరాలుగా మయన్మార్‌లో నివసిస్తున్నారు. కానీ, ఆ దేశం వారిని తమ పౌరులుగా గుర్తించదు. రోహింగ్యా బెంగాలీ పదమని, వారంతా బంగ్లాదేశ్‌ నుంచి తమ దేశానికి(అక్రమంగా) వచ్చారని మయన్మార్‌ వాదిస్తోంది. తమ దేశం నుంచి వెళ్లిపోయేలా ‘పొగ’ పెడుతోంది. హింసను భరించలేక రోహింగ్యాలు ప్రాణాలకు తెగించి మరీ వలస వెళుతున్నారు. సముద్రంలో నాటు పడవల్లో ప్రయాణిస్తూ బంగ్లాదేశ్‌తోపాటు థాయ్‌లాండ్‌, మలేసియా తదితర దేశాలకు చేరుకుంటున్నారు. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్‌ సూకీ పార్టీ నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినా వారి పరిస్థితి మారకపోగా కష్టాలు మరింత పెరిగాయి. రోహింగ్యాల అణచివేత వార్తలు విూడియాలో రాకుండా ‘సెన్సార్‌’ మొదలైంది. ‘బీబీసీ బర్మా’ చానల్‌ దీనిపై బహిరంగంగా నిరసన ప్రకటించింది.కాగా, ‘అరాకన్‌ రోహింగ్యాల విముక్తి సేన’ (అర్సా) పేరుతో ఏడాది క్రితం దళం ఏర్పడింది. రోహింగ్యాల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టింది. దీనిని తీవ్రవాద సంస్థగా పరిగణించిన మయన్మార్‌ సర్కార్‌.. రోహింగ్యాలపై అణచివేతను ముమ్మరం చేసింది. దాడులతో సైన్యం వారిపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో రఖైన్‌లో ఉండలేక బంగ్లాదేశ్‌లోకి వలసలు భారీగా పెరిగిపోయాయి. డజన్లకొద్దీ రోహింగ్యాలు తూటా గాయాలు, విరిగిన ఎముకలతో బంగ్లాదేశ్‌కు వస్తున్నారు. గతనెల 25 నుంచి ఇప్పటిదాకా బంగ్లాదేశ్‌కు 87,000 వేల మంది వలస వచ్చారు. బంగ్లాదేశ్‌లో అంతకుముందే సుమారు 4లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు, మయన్మార్‌ నుంచి భారత్‌కు అక్రమంగా వచ్చిన రోహింగ్యాలను తిప్పి పంపాలన్న భారత్‌ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై కేంద్రం నుంచి నివేదిక కోరింది.

సూకీ తక్షణ చర్యలు చేపట్టాలి హింసాకాండను నిలువరించాలి పాకిస్తాన్‌ తో పాలు ఇతర దేశాలు అశ్రయం ఇవ్వాలి – మలాలా డిమాండ్‌

”నోబెల్‌ శాంతి బహుమతి విజేత సూకీ మా తరానికి గొప్ప స్ఫూర్తి. కానీ, రోహింగ్యాలపై జరుగుతున్న అణచివేతతో బర్మాకు చెడ్డపేరు వస్తోంది. దీనిపై సూకీ స్పందించాలని మలాలా డిమాండ్‌ చేశారు . హద్దు ఆపు లేకుండా కొనసాగతున్న హింసను ఆపాలి. మయన్మార్‌ బలగాలను చిన్న పిల్లలను కూడా చంపేస్తున్నాయి. తరతరాలుగా వారు మయన్మార్‌లోనే నివసిస్తున్నారు. ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతారు? పాకిస్థాన్‌తోపాటు ఇతర దేశాలు కూడా రోహింగ్యాలకు ఆశ్రయం ఇవ్వాలి.”