మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు

బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన మహారాష్ట్ర అసెంబ్లీ
బిల్లుకు మద్దతిచ్చిన రాజకీయ పార్టీలన్నింటికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు
ముంబై నవంబర్‌29 (జ‌నంసాక్షి) : ముందుగా మాట ఇచ్చినట్లే మరాఠాలకు శుభవార్త అందించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ బిల్లును మండలి ఆమోదం కోసం పంపించింది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన కొద్ది సేపటికే మూజువాణి ఓటు ద్వారా దానిని పాస్‌ చేయడం విశేషం. ఈ బిల్లుకు మద్దతిచ్చిన రాజకీయ పార్టీలన్నింటికీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ కృతజ్ఞతలు తెలిపారు. మరాఠా కోటా విషయమై రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌ చేసిన సిఫారసులపై తీసుకున్న చర్యలకు సంబంధించిన రిపోర్టును కూడా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కొన్నాళ్లుగా మహారాష్ట్రలో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో మరాఠా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టే సమయంలో ధన్‌గర్‌ సామాజికవర్గానికి చెందిన రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఫడ్నవీస్‌ ప్రస్తావించారు. ప్రస్తుతానికి దానిపై ఇంకా నివేదిక రాలేదని, తాము నియమించిన సబ్‌ కమిటీ అదే పనిలో ఉన్నదని ఆయన చెప్పారు.