మరింత ఆందోళనకరంగా దేశంలో ఆర్థిక పరిస్థితులు

ఆర్థికరంగంపై రఘురామ రాజన్‌ హెచ్చరికలు

ఆయన సూచనలపై అప్రమత్తం కావాల్సిన సమయం

న్యూఢిల్లీ,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వరుసగా చేస్తున్న హెచ్చరికలకు, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు పోలికలు ఉన్నాయి. దేశంలో ఉల్లిగడ్డల ధరల పెరుగుదల ఒక్కటే కాకుండా పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికితోడు నిత్యావసరాలు ప్రజలకు అందుబాటులో లేకుండా పరుగులు పెడుతున్నాయి. అంబానీలు, ఆదానీలు కోట్లకు ఎగబాకుతున్న ప్రస్తుత తరుణంలో సామాన్యులు మాత్రం పూట తిండి కోసం వెంపర్లాడుతున్నారు. దేశ అర్థిక వ్యవస్థ కునారిల్లుతున్నా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం దిద్దబుట చర్యలకు

ఉపక్రమించడం లేదు. రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్టక్షన్ర్‌ రంగాలు టైంబాంబ్‌లా మారాయని, అవి ఎప్పుడు కుప్పకూలుతాయో తెలియదని రఘురామ రాజన్‌ బాంబులు పేల్చారు. ఎకానవిూపై సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదంటూ కేంద్ర ప్రభుత్వం తీరును వేలెత్తిచూపారు. మోడీ సర్కారు విధానాలు సరిగ్గా లేవని కుండబద్దలు కొట్టారు. ఇండియా ఎకానవిూ నీరసించి పోతున్నదని, మందగమనం నడిమధ్యలో ఉందని హెచ్చరించారు. అధికారం అంతా ప్రధానమంత్రి ఆఫీసులో ఉండటం, మంత్రులకు అధికారాలు లేకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందంటూ ఇండియా టుడే పత్రికలో వ్యాసం రాశారు. నిజానికి ఆయన సూచనలు ఇప్పుడు హెచ్చరికలు కావాలి. మందగమనంపై దృష్టి సారించాలి. జిడిపి 5శాతం కూడా లేదన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.భూమి, పెట్టుబడి, కార్మికశక్తి సులువగా దొరికేలా మార్పులు తీసుకురావాలి. ఇన్వెస్ట్‌మెంట్లు పెరిగేలా నిర్ణయాలు ఉండాలి. మంత్రులు నిస్సహాయులుగా మిగిలిపోవడం, స్పష్టమైన దూరదృష్టి లేకపోవడం, వేరే అంశాలపై దృష్టి పెట్టడం వల్ల ఎకానవిూ బలహీనమవుతుంది. ప్రధానమంత్రి కార్యాలయం మరింత దృష్టి సారిస్తేనే ఆర్థిక సంస్కరణలు ఊపందుకుంటాయని రఘురామ్‌ రాజన్‌ వివరించారు. పోటీతత్వాన్ని, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇండియా వెంటనే ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్లను కుదుర్చుకోవాలన్నారు. ఆర్థిక సంస్కరణల విషయంలో కేవలం కొందరు వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. రాష్ట్రస్థాయి ఆర్థిక వ్యవహారాల గురించి మాత్రమే వీరికి అవగాహన ఉంటుంది. జాతీయస్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలియదు. స్పష్టమైన ఎజెండా కూడా లేదు. ఇది వరకటి పార్టీలు కూడా కూటమి ప్రభుత్వాలను నడిపినప్పటికీ, ఎకానవిూని సరళీకరించడానికి కృషి చేశాయి. అధికారం అంతా ఒక్కచోటే కేంద్రీకృతంకావడం కూడా దీనికి కారణమని నిర్మొహమాటంగా చెప్పారు. సమస్యను పూర్తిగా అర్థం చేసుకుంటే, మోడీ ప్రభుత్వం ఎకానవిూ మందగమనం సమస్యను పరిష్కరించవచ్చన్నారు. అంటే సమస్యను అర్థం చేసుకోవడం లేదని ఆయన హెచ్చరించారు. జీడీపీ సెప్టెంబరు క్వార్టర్‌లో ఆరేళ్ల కనిష్టం 4.5 శాతానికి పడిపోవడం, ద్రవ్యోల్బణం, వినిమయం తగ్గిన నేపథ్యంలో ఆయన ఈ అంశాలను లేవనెత్తారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాలు ఎప్పుడైనా కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఆర్థిక సంస్కరణల విషయంలో అందరి అభిప్రాయాలు స్వీకరించాలి. ఆర్థికవేత్తల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముక్కుసూటిగా చెప్పారు. దివాలా కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ సూచనలు ప్రభుత్వం కొంతమేరకైనా అంగీకరించాలి. అప్పుడే కొంతయినా మేలు కలగవచ్చు. లేదా ఆర్తికవేత్తలతో చర్చించి సమస్యనుదారికి తెచ్చే ప్రయత్నం చేయాలి.