మరింత సమర్థంగా ఎయిర్‌టెల్‌ 4జీ నెట్‌వర్క్‌

సమర్థ టెక్నాలజీ వినియోగానికి నిర్ణయం

న్యూఢిల్లీ,జనవరి23(జ‌నంసాక్షి): దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు త్వరలోనే కష్టాలు తొలగనున్నాయి. పది సర్కిళ్లలో తన కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి ఎయిర్‌టెల్‌ రంగం సిద్ధంచేసింది. ముంబయి, ఢిల్లీ, కర్నాటక, ఆంధప్రదేశ్‌, కోల్‌కతా, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, నార్త్‌ఈస్ట్‌, అస్సోం, రాజస్థాన్‌ సర్కిళ్లలోని కస్టమర్లకు నాణ్యతతో కూడిన మెరుగైన 4జీ సేవలు ఇక లభిస్తాయి. ఇందుకోసం ఎయిర్‌టెల్‌ 900 ఎంహెచ్‌జెడ్‌ 4జీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. దీనితో 4జీ సేవల నాణ్యత మెరుగుపడటమే కాక డేటా స్పీడ్‌ పెరుగుతుంది. గృహాలు, కార్యాలయాలు, మాల్స్‌లో లోపలవైపున సిగ్నలింగ్‌ సమస్యకు చెక్‌ పడుతుంది. కాల్‌డ్రాప్‌ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎయిర్‌టెల్‌ ఇప్పటివరకు రాష్ట్రంలో ఇప్పటి వరకు వాడుతున్న స్పెక్టమ్ర్‌కు అదనంగా 900ఎంహెచ్‌జెడ్‌ (ఎల్‌టీఈ 900) స్పెక్టమ్ర్‌ను కూడా ఉపయోగించనుంది. ఎయిర్‌టెల్‌లో జరిగిన ఈ మార్పు 4జీ వినియోగదారులకు ఎంతో సౌలభ్యంగా ఉండబోతున్నది. ఎయిర్‌టెల్‌ అప్‌గ్రేడెడ్‌ నెట్‌వర్క్‌తో హెచ్‌డీ క్వాలిటీ కాల్‌ సేవల అనుభూతి లభించనుంది. టెలికం రంగంలో 5జీ ప్రవేశం జరగబోతుండగా సరైన సమయంలో ఈ సేవలను అందించేందుకు మరోవైపు ఎయిర్‌టెల్‌ సంసిద్ధమవుతున్నది. ఇందులో భాగంగానే తాజాగా 4జీ నెట్‌వర్క్‌లో ఎయిర్‌టెల్‌ మార్పులు చేసింది. ఈ మార్పుల కారణంగా 2జీ, 3జీ నెట్‌వర్క్‌పై రద్దీ తగ్గి 2జీ, 3జీ వినియోగదారులకు కూడా కాల్స్‌ బాగా దొరుకుతాయి. ఇప్పటివరకు వినియోగదారులు 4జీ నెట్‌వర్క్‌పై కాల్స్‌ దొరకక 2జీ, 3జీ నెట్‌వర్క్‌ను సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకుని ఉపయోగిస్తున్నారు. ఇక ఆ సమస్యకు తెరపడినట్లు అయింది.