మరో ప్రయోగానికి రంగం సిద్ధం

24 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత పీఎస్‌ఎల్వీ సీ-57 (PSLV C-57) రాకెట్‌ నింగిలోకి

తిరుపతి: అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో (ISRO) దూసుకుపోతున్నది. చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ఇచ్చిన ఊపులో మరో ప్రయోగానికి రంగం సిద్ధంచేసింది. సూర్యుని రహస్యాలను ఛేదించడమే లక్ష్యంగా ఆదిత్య ఎల్‌-1 (Aditya-L1) ప్రయోగాన్ని చేపట్టింది. శనివారం ఉదయం 11.50 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి ప్రయోగించనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ (Countdown) ప్రారంభమైంది. సరిగ్గా 24 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత పీఎస్‌ఎల్వీ సీ-57 (PSLV C-57) రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో పరిస్థితిని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ సమీక్షిస్తున్నారు.

సూర్యుడు-భూమి క‌క్ష్యలోని లగ‌రేంజ్ పాయింట్ (L1) వ‌ద్ద స్పేస్‌క్రాఫ్ట్‌ను ఉంచుతారు. ఆ పాయింట్ భూమికి దాదాపు 1.5 మిలియ‌న్ల కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఎల్‌-1 పాయింట్‌లో శాటిలైట్‌ను నిల‌ప‌డం వ‌ల్ల‌.. సూర్యుడిని నిరంత‌రం చూసే అవ‌కాశం ఉంటుంద‌ని ఇస్రో తెలిపింది.

ఆదిత్య ఎల్-‌1 స్పేస్‌క్రాఫ్ట్‌లో మొత్తం ఏడు పేలోడ్స్ ఉన్నాయి. ఫోటోస్పియ‌ర్‌, క్రోమోస్పియ‌ర్‌, సూర్యుడి బాహ్యభాగం, సూర్యుడి కేంద్రకం కరోనాతో పాటు ఇత‌ర ప్రాంతాల‌ను స్టడీ చేయ‌నున్నారు. ఎల‌క్ట్రోమ్యాగ్నటిక్‌, పార్టిక‌ల్‌, మ్యాగ్నటిక్ ఫీల్డ్ డిటెక్టర్లతో ఈ అధ్యయనం చేయనున్నారు. ఎల్-‌1 పాయింట్ నుంచి నాలుగు పేలోడ్స్ నేరుగా సూర్యున్ని వీక్షించ‌నున్నాయి. ఇక మిగితా మూడు పేలోడ్స్ మాత్రం ఆ పాయింట్ వ‌ద్ద ఉన్న ప‌దార్ధాల‌ను స్టడీ చేయ‌నున్నాయి. ఈ పేలోడ్స్ వ‌ల్ల సౌర వ్యవ‌స్థకు చెందిన కీల‌క‌మైన శాస్త్రీయ స‌మాచారం దొరుకుతుంద‌ని సైంటిస్టులు భావిస్తున్నారు.