మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?

– మోదీ షదర్‌పవార్‌ భేటీపై ఉత్కంఠ
– శిసేనకు 17 మంది ఎమ్మెల్యేల షాక్‌
ముంబై, నవంబర్‌ 20(జనంసాక్షి):మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో వరుస భేటీలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. శిసేనకు అదికారం దక్కినట్లే దక్కి దూరం అవుతోంది. కాంగ్రెస్‌-ఎన్సీపిల మద్దతుతో అధికారంలోకి వస్తుందనుకుంటున్న తరుణంలో ఎన్సీపి అధినేత శరద్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలు గందరగోళంలోకి నెట్టాయి. పట్టుదలకు పోవడం వల్లనే అధికారం పంచుకోలేక పోతున్నట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా అభిప్రాయపడ్డారు. మొత్తంగా శివసేన,బిజెపి కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని కేంద్రమంత్రి అథవాలే చేసిన వ్యాఖ్యలు కూడా మళ్లీ కొత్త పొత్తులు పొడుస్తాయా అన్న భావన కలిగిస్తున్నారు.  అటు శివసేన ముఖ్య నేత సంజయ్‌ రౌత్‌ మాత్రం రోజుకో ప్రకటన చేస్తున్నారు. అటు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. తాజాగా ప్రధానిని కలిశారు. కేవలం మహారాష్ట్రలో రైతులకు సాయం కోసంమాత్రమే కలిశామని అంటున్నారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్రంలో మెజారిటీ ఎవరికి ఉంటే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చునని రౌత్‌ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి అవకాశం ఇవ్వకుండా శివసేన ముందుకువస్తే.. ఆ పార్టీతో కలిసి ఎన్సీపీ, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చునన్న ఊహాగానాల నేపథ్యంలో శరద్‌  పవార్‌ సోనియాతో భేటీ అయ్యారు. సోనియా నివాసంలో వీరి భేటి జరిగింది. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమేనంటూ ఎన్సీపీ ఇప్పటికే సంకేతాలు పంపిన సంగతి తెలిసిందే. శివసేన హ్యాండ్‌ ఇచ్చిన నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై  బీజేపీ అధినాయకత్వం ఎలాంటి అడుగు వేయలేదు. సీఎం పదవి పంచే ప్రసక్తే లేదని, అయితే ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వం విషయంలో శివసేనకు డోర్లు తెరిచే ఉన్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. ఇక, మహారాష్ట్రలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాని సంగతి తెలిసిందే. శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ వందకుపైగా స్థానాలు సాధించినప్పటికీ.. ఆ పార్టీ మెజారిటీ మార్కుకు చాలా దూరం నిలిచిపోయింది. మరోవైపు 56 స్థానాలు గెలిచిన రియల్‌ కింగ్‌మేకర్‌గా అవతరించిన శివసేన సీఎం పీఠాన్ని సగకాలం తమకు పంచాల్సిందేనని పట్టుబడుతోంది. సీఎం పదవిని పంచేందుకు బీజేపీ ఏమాత్రం సిద్ధపడటం లేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చునని చెప్తున్నా.. అదీ ఎంతవరకు సాధ్యమనేది తేలడం లేదు.
శిసేనకు 17 మంది ఎమ్మెల్యేల షాక్‌
మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. అంచనాలకు అందకుండా రాజకీయాలు రసవత్తరంగా తయారయ్యాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ధీమాగా ఉన్న శివసేనకు బుధవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు గట్టి షాక్‌ ఇచ్చారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ 17 మంది ఎమ్మెల్యేలు గళమెత్తారు. అసమ్మతి ఎమ్మెల్యేలు పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేతో భేటీ కానున్నారు. మరోవైపు శివసేన సారథ్యంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ సమావేశం ప్రాధాన్యత సంతరించుకోగా రైతుల సమస్యలపైనే తాను ప్రధానిని కలిశానని పవార్‌ వెల్లడించారు. మహారాష్ట్ర రాజకీయాలు తమ భేటీలో ప్రస్తావనకు రాలేదని తెలిపారు. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మధ్య సంప్రదింపులు కొలిక్కిరాని క్రమంలో సొంత పార్టీలోనే అసమ్మతి స్వరాలు వినిపిస్తుండటం శివసేనకు ఇబ్బందికరంగా మారింది. ఇక బీజేపీ సైతం శివసేన అసంతృప్త ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్లతో పాటు తమతో కలిసివచ్చే ఇతర పార్టీల్లోని ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతూ ప్రభుత్వ ఏర్పాటుకు తమ ముందున్న అవకాశాలపై ఆరా తీస్తోంది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ఎన్నికల ముందు బీజేపీ, శివసేన ఉమ్మడిగా బరిలోకి దిగాయి. ప్రభుత్వ ఏర్పాటులో ఇరు పార్టీలు సీఎం పీఠాన్ని చెరో సగం కాలవ్యవధి(50-50) నిర్ణయంతో పోటీలో నిలిచాయి. ఎన్నికల్లో ఇరుపార్టీలకు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. తీరా సీఎం పీఠంపై చర్చ జరగగా.. అందుకు బీజేపీ ఒప్పుకోలేదు. దీంతో, శివసేన.. బీజేపీ నుంచి దూరమైంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కదిపింది. అందుకు గాను గవర్నర్‌ తక్కువ కాల పరిమితి ఇవ్వడంతో ఇరుపార్టీల చర్చలు కొలిక్కి రాకముందే, వారి నిర్ణయాన్ని ప్రకటించకముందే.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం, కేబినెట్‌ ఈ అంశాన్ని ఆమోదించడం, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడడం చకాచకా జరిగిపోయాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లు గవర్నర్‌ ప్రకటించారు.  మరోవైపు ఎన్సీపీ కాంగ్రెస్‌తో చర్చలు జరిపినా ఏ అంశం కొలిక్కి రాలేదు. కాగా, తాజాగా శివసేనకు సంబంధించిన 17 ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు ప్రకటించారు. దీంతో, అసమ్మతి ఎమ్మెల్యేలు శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ థాక్రే అపాయింట్‌మెంట్‌ కోరారు. ఇలాంటి కీలక సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం, శివసేనకు పెద్ద తలనొప్పిగా మారింది..