మాజీ క్రికెటర్ ఎంవీ శ్రీధర్ కన్నుమూత
హైదరాబాద్: మాజీ క్రికెటర్, హైదరాబాద్ టీమ్ మాజీ కెప్టెన్ ఎంవీ శ్రీధర్ ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు. బంజారాహిల్స్‌లోని స్టార్ హాస్పిటల్లో గుండెపోటుతో ఆయన మరణించారు. ఆయన వయసు 51 ఏళ్లు. నాలుగేళ్లు బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్‌గా ఉన్న శ్రీధర్.. గత నెలలోనే పదవి నుంచి తప్పుకున్నారు. చాలా ఏళ్లుగా బోర్డు పరిపాలనలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా కూడా సేవలందించారు. హైదరాబాద్ తరఫున 1988 నుంచి 1999 మధ్య దేశవాళీ క్రికెట్లో ఆడారు. రంజీ ట్రోఫీలో మూడో అత్యధిక స్కోరు శ్రీధర్ పేరిటే ఉంది. 1994లో ఆంధ్ర టీమ్‌పై 366 రన్స్ చేశారు శ్రీధర్. అదే మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్ రంజీ ట్రోఫీలో అత్యధిక స్కోరైన 944 పరుగులు చేసింది. శ్రీధర్ మొత్తం 97 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 48.91 సగటుతో 6701 రన్స్ చేశారు. అందులో 21 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 35 లిస్ట్ ఎ మ్యాచ్‌లు కూడా ఆడారు. 2010-11 సీజన్లో హైదరాబాద్ టీమ్‌కు తాత్కాలిక కోచ్‌గా కూడా పనిచేశారు. 2016 టీ20 వరల్డ్‌కప్‌కు టోర్నీ డైరెక్టర్‌గానూ శ్రీధర్ వ్యవహరించారు.