మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు

– ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు తనకు టచ్‌లోనే ఉన్నారు

– ముంబైకి వెళ్లేముందు తనకు చెప్పే వెళ్లారు

– కర్ణాటక సీఎం కుమారస్వామి

బెంగళూరు, జనవరి14(జ‌నంసాక్షి) : కర్ణాటకలో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులతో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టచ్‌ లో ఉన్నారన్న విషయంపై కుమారస్వామి స్పందించారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు తనతో మాట్లాడుతున్నారని, ముంబైకి వెళ్లే ముందు తనకు చెప్పి వెళ్లారని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎమ్మెల్యేలు ఏం ఆఫర్‌ చేస్తున్నారో తమకు తెలుసన్నారు. ఎమ్మెల్యేలను ఎలా కట్టడి చేస్తామన్న కుమారస్వామి, ఈ విషయంలో విూడియా ఎందుకు ఆందోళన చెందుతుందని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ ప్రభుత్వం పడిపోయే ఛాన్సే లేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర స్పష్టం చేశారు. ప్రభుత్వం పడిపోతోందని బీజేపీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులతో టచ్‌ లో ఉన్నారని, ఓ ¬టల్లో ఉంటున్నారని వార్తలు వస్తున్నాయని, అయితే ఆ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని ఎవరూ చెప్పడం లేదన్నారు. ఈ వార్తలు ఊహగానాలే అని ఆయన స్పష్టం చేశారు. తమ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని పరమేశ్వర తేల్చిచెప్పారు. తమ మంత్రులతో బడ్జెట్‌ పై సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో బడ్జెట్‌ ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ నేత, మంత్రి డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో జేడీఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆపరేషన్‌ లోటస్‌ (కమలం)ను బీజేపీ చేపట్టిందని

తెలిపారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలకు తెగబడుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కుమారస్వామి బీజేపీ పట్ల కొంత మేర సానుకూలంగా ఉన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, సానుకూలత అంటే మరో విధంగా అనుకోవద్దని… బీజేపీ గురించి ఆయన తెలిసిన విషయాలను కుమారస్వామి బయటకు వెల్లడించడం లేదని… ఈ కోణంలోనే తాను ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. బీజేపీ చేస్తున్న కుట్రలను కుమారస్వామి, సిద్ధరామయ్యల దృష్టికి కూడా తాము తీసుకెళ్లామని తెలిపారు. వేచి చూసే ధోరణిని కుమారస్వామి అవలంభిస్తున్నారని శివకుమార్‌ అన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో తాను ఉండి ఉంటే… బీజేపీ కుట్రలన్నింటినీ 24 గంటల్లో బయటపెట్టేవాడినని తెలిపారు. సంక్రాంతి తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుందని సీఎం చెబుతున్నారని… ఏ మార్పు వస్తుందో చూడాలని అన్నారు.