ముంబైని వదలని భారీ వర్షాలు

రాకపోకలకు తీవ్ర అంతరాయం
విమానాల రాకపోకలపై ఆంక్షలు
ముంబై,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  భారీ వర్షాలతో మహారాష్ట్ర మళ్లీ నీట మునిగింది. దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనజీవనం స్థంభించింది. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. పలు అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరింది. బహుళ అంతస్థుల భవనాల నుంచి నీరు జాలివారుతూ జలపాతాలను తలపిస్తోంది. దీంతో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముంబైలో వరదలు వెల్లువెత్తడంతో గురువారం కూడా ముంబై పరిసర ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించడంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా నగరాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిందని మంత్రి ఆశిష్‌ పేర్కొన్నారు. భారీవర్షాల వల్ల సియాన్‌, వడాల రోడ్డు రైల్వేస్టేషనుతోపాటు ముంబైలోని పలు లోతట్టుప్రాంతాల్లో వరదనీరు నిలిచి చెరువులను తలపించాయి. దీంతో రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరదల వల్ల సాధారణ జన జీవనానికి అంతరాయం ఏర్పడింది.ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు విమానాల రాకపోకలపై ప్రభావం చూపిస్తోంది. ఎయిర్‌ పోర్టులను వరదలు ముంచెత్తడంతో ముంబైలో 20 విమాన సర్వీసులను రద్దు చేశారు. భారీవర్షాల వల్ల వాతావరణం అనుకూలించక పోవడంతో 280 విమానాల రాకపోకల్లో మార్పులు చేశారు.  రోజు వెయ్యికి పైగా విమానాలు రాకపోకలు సాగించే ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇప్పుడు 44 శాతం విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాతావరణం అనుకూలించక పోవడం వల్ల పలు విమానాలు ఎయిర్‌ పోర్టులోనే చక్కర్లు కొడుతున్నాయి. విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు రాత్రి నుంచి ఎయిర్‌ పోర్టు ప్రాంగణంలోనే సేద తీరుతున్నారు. ఇకపోతే ముంబైలో నయాగారా జలపాత అందాలను చూసి మైమరిచి పోతున్నారు స్థానికులు. కొండకోనలు, నదీ ప్రవాహాల దగ్గర మాత్రమే పరిమితం అయ్యే జలపాతపు అందాలు ఇప్పుడు కాంక్రీట్‌ జంగిల్‌లో కనువిందు చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నలభై అంతస్తుల భవనం టెర్రస్‌పై నిలిచిపోయిన నీరు కిందకు జాలువారుతూ జలపాతపు అందాలను సంతరించుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు స్మార్ట్‌ ఫోన్లకు పని చెప్పారు. వీడియోలు, ఫొటోలతో హడావుడి చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ విూడియాలో వైరల్‌ గా మారింది. ముంబై నయాగారా హ్యాష్‌ ట్యాగ్‌ లతో ¬రెత్తిస్తున్నారు నెటిజన్లు.