ముఫ్తీని కలుసుకునేందుకు కూతురుకు అనుమతి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీని కలుసుకునేందుకు ఆమె కూతరు ఇతిజా జావెద్‌కు సుప్రీకోర్టు అనుమతినిచ్చింది. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్‌లో పలువురు నేతల్ని గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే. శ్రీనగర్‌లో మెహబూబా ముఫ్తీని కూడా హౌజ్‌ అరెస్టు చేశారు. దీంతో ఆమె కూతురు జావెద్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. తన తల్లిని కలుసుకునే అవకాశం కల్పించాలని కోర్టును వేడుకున్నది. అమ్మ ఆరోగ్యం సరిగా లేదని, ఆ విషయం ఆందోళన కలిగిస్తున్నదని, అమ్మను చూసి నెల రోజులు అవుతున్నదని తన పిటిషన్‌లో జావెద్‌ పేర్కొన్నది. దీంతో ముఫ్తీని కలుసుకునేందుకు కోర్టు ఆమె కూతురుకు అనుమతి ఇచ్చింది. జావెద్‌ తరపున అడ్వకేట్‌ ఆకర్ష్‌ కమ్రా పిటిషన్‌ దాఖలు చేశారు. సీతారం ఏచూరి తరహాలోనే ఇతిజాకు కశ్మీర్‌ వెళ్లే అవకాశం ఇవ్వాలన్నారు. కశ్మీరీ నేతలను జంతువుల్లా బంధించారని ఇటీవల ఇతిజా ఓ వీడియో సందేశంలో ఆరోపించిన విషయం తెలిసిందే.