ముస్లింలు, దళితులపై..  క్రూరమైన చట్టాలను ఉపయోగిస్తున్నారు

– అంతర్జాతీయ ఒప్పందాల కోసం జాతీయవాదాన్ని అమ్మేస్తున్నారా?
– లోక్‌సభలో ఎంఐఎం ఎంపీ అసద్దుదీన్‌ ఓవైసీ
న్యూఢిల్లీ, జులై24(జ‌నంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం ముస్లింలు, దళితులపై క్రూరమైన చట్టాలను ఉపయోగిస్తుందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. బుధవారం లోక్‌సభలో ఓవైసీ.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలు, దళితులపైనే క్రూరమైన చట్టాలను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. చట్టవిరుద్ద కార్యక్రమాలకు పాల్పడేవారిపై కఠిన శిక్షను అమలు చేయాలంటూ ప్రవేశపెట్టిన బిల్లుపై ఓవైసీ మాట్లాడారు. యూఏపీఏ బిల్లు.. ఆర్టికల్‌ 21ని ఉల్లంఘిస్తుందన్నారు. న్యాయపరమైన హక్కుల్ని ఆ బిల్లు నాశనం చేస్తోందన్నారు. అంతర్జాతీయ ఒప్పందాల కోసం జాతీయవాదాన్ని అమ్మేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. గతంలో ఇలాంటి కఠినమైన చట్టాలను చేసిన కాంగ్రెస్‌ పార్టీని కూడా ఓవైసీ తప్పుపట్టారు. ఈ చట్టాల ద్వారా ఒక్క కాంగ్రెస్‌ నేతనైనా అరెస్టు చేయండి, అప్పుడే వాళ్లకు ఆ చట్టం తెలుస్తుందని ఓవైసీ కాంగ్రెస్‌ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో బీజేపీ సభ్యులు ఓవైసీకి మద్దతు పలకడం గమనార్హం. బిల్లుపై టీఆర్‌ఎస్‌ ఎంపీ బొర్లకుంట వెంకటేశం మాట్లాడారు. ఉగ్రవాదికి, ఉగ్ర సంస్థకు మధ్య తేడాలను బిల్లులో స్పష్టం చేయాలన్నారు. అనుమానిత వ్యక్తికి సంబంధించిన ఆస్తులను రాష్టాన్రికి చెప్పకుండానే ఎన్‌ఐఏ జప్తు చేస్తుందని బిల్లులో పేర్కొన్నారని, ఇది ఫెడరల్‌ స్పూర్తికి విరుద్దమన్నారు. ఇతర క్రిమినల్స్‌తో ఉగ్రవాదులను పోల్చలేమని బీజేపీ ఎంపీ డాక్టర్‌ సత్యపాల్‌ సింగ్‌ తెలిపారు. అందుకే వారి కోసం కఠినమైన చట్టాలు అవసరం అన్నారు. భారతీయ ప్రజాస్వామ్యంలో టాడా, పోటా లాంటి చట్టాలు నిలువలేవని ఎంపీ ప్రేమ్‌చంద్రన్‌ తెలిపారు.