మెడికల్‌ విద్యార్థిని ర్యాగ్‌ చేసిన సీనియర్లు

అరెస్ట్‌ చేసి జైలుకు పంపిన పోలీసులు
బెంగళూరు,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):   ఓ మెడికల్‌ కాలేజీకి చెందిన ఐదుగురు సీనియర్‌ స్టూడెంట్స్‌.. ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ర్యాగింగ్‌ చేశారు. ఈ సంఘటన బెంగళూరు రాజాజీనగర్‌ లోని కాలేజీ హాస్టల్‌ లో క్రిస్మస్‌ పండుగ రోజున చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. డిసెంబర్‌ 24న అర్ధరాత్రి పీకల దాకా మద్యం సేవించిన ఐదుగురు సీనియర్‌ విద్యార్థులు.. ఫస్టియర్‌ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థి గదిలోకి వెళ్లారు. ఆ తర్వాత అతడిని అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ.. తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా టెర్రస్‌ పైకి తీసుకెళ్లి తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు. సీనియర్ల వేధింపులు భరించలేని బాధితుడు.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ర్యాగింగ్‌ కు పాల్పడ్డ ఐదుగురు సీనియర్లను అరెస్టు చేసి జైలుకు తరలించారు. కర్ణాటక ఎడ్యుకేషన్‌ చట్టం 1983 ప్రకారం.. ర్యాగింగ్‌కు పాల్పడిన ఏ విద్యార్థికైనా ఏడాది పాటు జైలు శిక్ష విధించనున్నారు. ర్యాగింగ్‌ తీవ్రతను బట్టి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసే అవకాశం ఉంది.