మెరుపు దాడులపై గోప్యత అవసరం

రాజకీయం కోసం ఉపయోగించడం ప్రమాదకరం
న్యూఢిల్లీ,డిసెబర్‌8(జ‌నంసాక్షి):పాక్‌ స్థావరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్‌ స్టయ్రిక్స్‌ను అదే పనిగా ఎక్కువ చేసి చూపించడం సమంజసం కాదని ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న ఆర్మీ మాజీ లెప్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ హుడా వెల్లడించారు. దీనివల్ల అనవసర వ్యవహారాలు రావడంతో పాటు గోప్యతకు తావు లేకుండా పోతుందన్నారు. ఇలాంటి వాటిని ఎన్నికలు, రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం చాలా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. మిలిటరీ చర్యలను రాజకీయ నాయకులు ఉపయోగించుకోకుండా సైన్యం అడ్డుకోవాలని కోరారు.2016 సెప్టెంబరులో మెరుపు దాడులు జరిగిన సమయంలో ఆయన నార్తెర్న్‌ ఆర్మీ కమాండర్‌గా ఉన్నారు. దీనిపై మరీ ఎక్కువ హైప్‌ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఆ సైనిక ఆపరేషన్‌ చాలా ముఖ్యమైనది. మేము అది చేయాలి. ఇప్పుడు దాన్ని రాజకీయం చేశారు, అది తప్పో ఒప్పో రాజకీయ నాయకులనే అడగాలని హుడా పేర్కొన్నారు. చండీగఢ్‌లో జరగుతున్న మిలిటరీ లిటరేచర్‌ ఫెస్టివల్‌ కార్యక్రమంలో ‘క్రాస్‌ బోర్డర్‌ ఆపరేషన్స్‌ అండ్‌ సర్జికల్‌ స్టైక్స్‌’ అంశంపై మాట్లాడిన హుడా పై విధంగా వ్యాఖ్యానించారు. మెరుపు దాడులపై గోప్యత పాటించి ఉంటే బాగుండేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇలాంటి దాడుల లక్ష్యం వ్యూహాత్మకమైనదని, అది శత్రువుల ధైర్యాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు. అయితే మెరుపు దాడుల వంటి విషయాలపై కొంత మేర ప్రచారం సైనికుల స్థైర్యాన్ని పెంచడానికి తోడ్పడుతుందని, కానీ దీనిపై మరీ ఎక్కువ ప్రచారం మంచిది కాదని సూచించారు.