మొత్తం 31జిల్లాలు

untitled-1
– ప్రజాభీష్టానికే పెద్దపీట

– కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,అక్టోబర్‌ 3(జనంసాక్షి):ఇప్పటికే ప్రకటించిన ముసాయిదా ప్రకారం 17 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్‌ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. చిన్న జిల్లాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని, సంక్షేమ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ సులభతరం అవుతుందని ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకున్నందున జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్య పెరిగినా అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఇవాళ కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌ జిల్లాల ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ నాయకులతో ముఖ్యమంత్రి చర్చించారు.దసరా రోజు ప్రారంభమయ్యే కొత్త జిల్లాలతో ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకుంటుంటే జనగామ, సిరిసిల్ల, గద్వాల ప్రాంతాల ప్రజలు బాధలో ఉండడం మంచిది కాదని సిఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. జనగామ, సిరిసిల్ల, గద్వాల జిల్లాల ప్రతిపాదనలపై కసరత్తు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు నాయకత్వంలో హై పవర్‌ కమిటీ వేసి అధ్యయనం చేస్తామని, రెండు మూడు రోజుల్లోనే నివేదిక తెప్పించుకుని తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ మూడు జిల్లాలను ఏఏ మండలాలతో కలిపి ఏర్పాటు చేయవచ్చో పరిశీలించాలని కూడా అధికారులను ఆదేశించారు.మొదటి, రెండవ రోజు చర్చల తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుపై నాయకుల్లో ఏకాభిప్రాయం వ్యక్తమయింది. దీని ప్రకారం వరంగల్‌ జిల్లాలో 5, కరీంనగర్‌ జిల్లాలో 4, మహబూబ్‌ నగర్‌ జిల్లాలో 4, మెదక్‌ లో 3, రంగారెడ్డిలో 3, నల్గొండలో 3, ఆదిలాబాద్‌ లో 3, నిజామాబాద్‌ లో 2, ఖమ్మంలో 2, హైదరాబాద్‌ లో 1 చొప్పున జిల్లాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా తెలంగాణలో 31 జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కసరత్తు జరపాలని నిర్ణయం తీసుకున్నారు.కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనే పేరు పెట్టాలని, వికారాబాద్‌ కేంద్రంగా ఏర్పడే జిల్లా పేరును వికారాబాద్‌ గానే ఉంచాలని, మహబూబాబాద్‌ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు మహబూబాబాద్‌ పేరునే ఉంచాలని నిర్ణయించారు. సిరిసిల్ల కేంద్రంగా ఏర్పడే జిల్లాకు రాజన్న పేరు పెట్టాలనే ప్రతిపాదనను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వరంగల్‌ జిల్లాలో మహబూబాబాద్‌, భూపాలపల్లి, జనగామ, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాలు ఏర్పాటు అయ్యే విషయంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.కరీంనగర్‌ జిల్లాలో ఇప్పటికే ప్రతిపాదించిన కరీంనగర్‌, జగిత్యాలతో పాటు సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ ను సానుకూలంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. హుజూరాబాద్‌, జమ్మికుంట మండలాలను కరీంనగర్‌ జిల్లాలోనే కొనసాగించాలని, కమలాపూర్‌, ఎల్కతుర్తి, భీమదేవపూర్‌ మండలాలను వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో, హుస్నాబాద్‌, కోహెడ్‌ మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. మంథని రెవెన్యూ డివిజన్‌ ను యథావిధిగా కొనసాగించాలని, పెద్దపల్లిని నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చాలని చెప్పారు.ఖమ్మం జల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాలపల్లి (ప్రొఫెసర్‌ జయశంకర్‌) జిల్లాలో కలపాలని, వరంగల్‌ జిల్లాలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపాలని, కరీంనగర్‌ జిల్లాలో కొత్తగా రుద్రంగి మండలం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా ఆరు మండలాలు (ఆళ్లపల్లి, కరకగూడెం, చుంచుపల్లి, లక్ష్మిదేవిపల్లి, సుజాతనగర్‌, అన్నపురెడ్డి) ఏర్పాటు చేసే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.ప్రతిపాదిత జనగామ జిల్లాలో కొత్తగా స్టేషన్‌ ఘణపూర్‌ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భూపాలపల్లి జిల్లాలోని ములుగుకున్న ప్రాధాన్యం, గిరిజన జనాభాను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకంగా నిధులు కూడా విడుదల చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా రాజధానిని కూడా వరంగల్‌ నగరంలోనే ఏర్పాటు చేయాలని సిఎం అధికారులకు సూచించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో గాదిగూడ, సిరికొండ మండలాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది.సిరిసిల్ల, జనగామ జిల్లాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు ఎంపి వినోద్‌ స్పష్టం చేశారు.  వరంగల్‌, కరీంనగర్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజా ప్రతినిధులతో సమావేశమై సిరిసిల్ల, జనగామ, గద్వాల జిల్లాల ఏర్పాటు విషయమై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఈమేరకు సమావేశం తర్వాత ఎంపీ వినోద్‌ మాట్లాడుతూ.. ప్రజల కోరిక మేరకే జిల్లాల విభజన జరగాలి కానీ నాయకుల కోసం కాదని సీఎం అన్నట్టు వివరించారు. సిరిసిల్ల జిల్లాలో 13 మండలాలు ఉండనున్నట్లు సమాచారం. ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు, ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ అన్నారు.  ప్రజల నుంచి వచ్చిన ప్రతీ డిమాండ్‌ను సీఎం కేసీఆర్‌ పరిష్కరిస్తున్నారని తెలిపారు. పారదర్శకంగా సమస్యలపై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసినందుకు ధన్యావాదాలు తెలిపారు. తకొత్త జిల్లాల ఏర్పాటు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతుందని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ అన్నారు. ఇవాళ కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం ఏర్పాటు చేసిన సమవేశానికి ఆయన హాజరైన తర్వాత విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఏది చేసినా ప్రజాస్వామ్య బద్దంగా, పారదర్శకంగానే చేస్తున్నారని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇదే విధానం అనుసరిస్తున్నారని స్పష్టం చేశారు. మొదట ప్రజా ప్రతినిధుల భేటీ, జిల్లాల కలెక్టర్లతో సమావేశం, మంత్రి వర్గం ఉప సంఘం, తర్వాత అఖిల పక్ష భేటీ ఇలా  ప్రజాస్వామ్య బద్దంగా అన్ని పద్దతులను అవలంభించే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని వివరించారు. ప్రజల అభ్యంతరాలను తెలుసుకోవడానికి 30 రోజుల సమయం కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నాడు కాంగ్రెస్‌, టీడీపీ నేతలు కొత్త జిల్లాల గురించి ఆలోచించనేలేదని విమర్శించారు. మనకన్న చిన్న రాష్ట్రాల్లో ఎక్కువ జిల్లాలు ఉండి అభివృద్ధి చెందుతున్నాయని గ్రహించలేక పోయారని వివరించారు. వాళ్ల హయంలో కొత్త జిల్లాల గురించి ఆలోచించిన పాపానపోలేదని మండిపడ్డారు. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో తానే పెట్టానని చెబుకుంటున్న నాయకుడు కొత్త జిల్లాల గురించి ఎందుకు ఆలోచించలేదని నిలదీశారు. చిన్న జిల్లాలు ఉంటే పాలన సానుకూలంగా సాగుతుందని వివరించారు. జనగామలో హంగామా మొదలైంది. జనగామను జిల్లాగా చేసేందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేసినట్లు ఇవాళ ఎంపీ వినోద్‌ చెప్పడంతో అక్కడ సంబరాలు మొదలయ్యాయి. జేఏసీ నేతలు పట్టణ వీధుల్లో ర్యాలీలు తీశారు. బస్టాండ్‌ దగ్గర ఉన్న ప్రధాన కూడలిలో భారీ ఎత్తున జనం గుమ్మికూడి నినాదాలు చేశారు. జనగామను జిల్లా చేయాలంటూ గత రెండు నెలలుగా పట్టణంలో దీక్షలు నిర్వహించారు. ఎన్నో నిరసన ప్రదర్శనలు కూడా చోటుచేసుకున్నాయి.