మోడీకి తప్ప అందరికి ఆహ్వానం

– ఠాక్రే కొడుకు వివాహానికి మోడీకి అందని ఆహ్వానం!

ముంబయి, జనవరి14(జ‌నంసాక్షి) : మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఈ నెలాఖరులో ఆయన కుమారుడి వివాహం జరగనుంది. ఈ శుభాకార్యానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ లాంటి ప్రముఖులు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఇంకా వివాహ ఆహ్వానం అందకపోవడం గమనార్హం. కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు రాజ్‌ ఠాక్రే గతవారం ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఆగిపోయారు. దీంతో తన అత్యంత సన్నిహతులైన హర్షల్‌ దేశ్‌పాండే, మనోజ్‌ హతేకు ఆహ్వాన బాధ్యతలు అప్పగించారు. గతవారం వీరిద్దరూ ఢిల్లీవెళ్లి పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మాస్వరాజ్‌, నితిన్‌ గడ్కరీ, ప్రకాశ్‌ జావడేకర్‌, ధర్మేంద్ర ప్రదాన్‌, మేనకా గాంధీ, భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ తదితరులను ఆహ్వానించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఆహ్వానించేందుకు హర్షల్‌, మనోజ్‌ ఆయన నివాసానికి వెళ్లగా రాహుల్‌ అందుబాటులో లేరు. అయితే అతిథుల జాబితాలో ప్రధాని మోదీ పేరు లేనట్లు తెలుస్తోంది. రాజ్‌ఠాక్రే కుమారుడి వివాహానికి మోడీకి ఇంకా ఆహ్వానం అందలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ మధ్య ఠాక్రే కూడా ఈ విషయంపై విూడియా ఎదుట ప్రస్తావించారు. కుమారుడి వివాహానికి ప్రధానిని ఆహ్వానిస్తారా అని అప్పట్లో విూడియా రాజ్‌ఠాక్రేను ప్రశ్నించగా.. ‘పెళ్లి అనే బంధాన్ని మోదీ నమ్ముతారా?’ అంటూ బదులిచ్చారు. దీంతో ప్రధాని మోదీని రాజ్‌ఠాక్రే ఆహ్వానిస్తారా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ఠాక్రే కుమారుడు అమిత్‌ వివాహం జనవరి 27న లోవర్‌ పరేల్‌లోని సెయింట్‌ రెగిస్‌ ¬టల్‌లో జరగనుంది. ప్రముఖ ఫిజీషియన్‌ డాక్టర్‌ సంజయ్‌ బోరుడె కుమార్తె మిథాలిని అమిత్‌ పెళ్లి చేసుకోనున్నారు.