మోడీ నిర్ణయాలతో ఆర్థికశక్తిగా భారత్‌: హరిబాబు

న్యూఢిల్లీ,డిసెంబర్‌21(జ‌నంసాక్షి): భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న ఆర్ధికశక్తిగా ప్రపంచదేశాలు గుర్తిస్తున్నాయని ఎంపి కంభంపాటి హరిబాబు తెలిపారు. మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని ఆకర్శిస్తున్నాయని అన్నారు. అవినీతిని అంతమొందించడం, నల్లధనం రూపుమాపాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్దనోట్ల రద్దు,జిఎస్టీవంటి  నిర్ణయాన్ని తీసుకున్నారని అన్నారు.  దేశప్రయోజనాలకోసం  ప్రధాని మోడీ అనేక కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. రాఫెల్‌పై  ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తూ ఒకరకమైన అభద్రతా వాతావరణాన్ని కల్పిస్తున్నాయని, అయినా ప్రజలు ఎటువంటి ఆందోళనలకు గురికాకుండా ప్రధానిపై నమ్మకాన్ని ఉంచారని తెలిపారు. అలాగే టెర్రరిజం అణచివేతకు కూడా ప్రధాని పిలుపు ఇప్పుడు ప్రపంచ దేశాలకు అవగతం అవుతోందన్నారు.ప్రజలు ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటున్నారని అన్నారు. అవినీతి రహితమైన దేశంకోసమే నరేంద్రమోదీ ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు.  నిరుపేదల ఉన్నతికి ముద్ర యోజన, జన్‌ధన్‌, సుకన్య సమృద్ధి, భేటీ బచావో…బేటీ పడావో తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. పెద్దనోట్ల రద్దుతో ఉగ్రవాదం నిర్మూలన, మాఫీయాకు అడ్డుకట్ట పడిందన్నారు.