మోడీ మోనార్క్‌ పాలన!

ఏ ముహుర్తాన మోడీ ఢల్లీిలో అడుగు పెట్టాడో కానీ ప్రజలకు రంగుల చిత్రం చూపాడు. బిజెపిని చాప చుట్టేసి తన చంకన పెట్టుకున్నాడు. బిజెపికి పెద్దలు అన్న వారు లేకుండా చేసారు. చాయ్‌వాలా ప్రధాని కాబోతున్నాడని అంతా భ్రమించారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి ప్రధాని అయితే..అది కూడా బిజెపి నుంచి అయితే అంతా మంచే జరుగుతుందని భావించారు. వరుసగా రెండోసారీ పట్టం కట్టారు. కానీ మోడీ చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే ..కేవలం గుజరాత్‌ అండ్‌ కో అధికారం చెలాయిస్తోంది. గుజరాత్‌ వ్యాపారు లకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలను పట్టించుకోకుండా తనపని తాను చేసకుంటూ అధికారం నిలుపుకునే ప్రక్రియలో ఆరితేరారు. అధికారాన్ని నిలుపుకోవడానికి ప్రత్యర్థి పార్టీలను పూర్తిగా దెబ్బతీసారు. బ్యాంకులు దివాలా తీసి..వేలకోట్లు ముంచిన వారు విదేశాల్లో హాయిగా సముద్ర తీరాల్లో సేదదీరుతున్నారు. దేశంలో ముంచేవారు ముంచుతున్నారు. బ్యాంకులు ప్రజలను ముంచేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో ప్రజలకు ఫలానా మేలు జరిగిందన్న దాఖలా లేదు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా ?…అన్నట్లుగా ఎడాపెడా వాయింపులతో ప్రజలకు చుక్కలు చూపుతున్నారు. సోషల్‌ డియాలో అహో ఓహో అంటూ చేస్తున్న ప్రచారాలు చూస్తుంటే భారతదేశం ఇంత అభివృద్ది సాధించిందా అన్న భ్రమలు కలుగుతున్నాయి. ఐదు రాష్టాల్ర ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా మోడీ తీరుపై ప్రజల్లో మాత్రం భ్రమలు తొలిగాయి. రాజు తలచుకుంటే ఏదైనా చేస్తాడు. మంచి అనుకుంటే మంచి..చెడు అనుకుంటే చెడు..తను కోరుకున్నది అనుకుంటే అదే అన్న చందంగా మోడీ పాలన సాగుతోంది. అతడికి ప్రజల బాగోగులు ..వారి కష్ట సుఖాలు పట్టడం లేదు… ప్రజలు ఏమైతే మనకేంటని అనుకునే నాయకులు ఉన్నంత వరకు వారు ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు ప్రధాని మోడీ తీరు కూడా అలాగే ఉంది. సామాన్యులు..మధ్యతరగతి ప్రజల పరిస్థితి పెనం విూంచి పొయ్యిలో పడ్డట్లు అయ్యింది. ఇకపోతే ఇటీవలి కాలంలో వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలతో సామాన్యులు బతకడం ఎలా అన్న భయంలో పడ్డారు. ఐదు రాష్టాల్ర ఎన్నికలతో ఆగిన ధరల దాడి ఇప్పుడు ఏకంగా పది రూపాయలకు పెరుగుతాయన్న వార్తలు అప్పుడే భయానికి గురి చేస్తోంది. మార్చి 7న ఐదు రాష్టాల్ర ఎన్నికలు ముగియడంతో ధరల మోత తప్పేలా లేదు. ఉక్రెయిన్‌ యుద్దమేఘాలు చూపి మళ్లీ పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. పెట్రో ధరలకు కూడా గత ప్రభుత్వాలను నింది స్తున్నారు. గతంలో పెట్రో ధరలు పెరగ్గానే లెఫ్ట్‌ పార్టీల నేతలు సహా అంతా రోడ్డెక్కే వారు. ఎడ్లబండ్లు బయలుదేరేవి. కానీ ప్రజలు, పార్టీలు అలసి పోయాయి. మోడీకి ఇది కూడా బాగా కలసి వస్తున్న అంశంగా చూడాలి. పెట్రోధరలు పెరుగుతున్నా తమకేవిూ పట్టనట్లుగా ప్రజలు అసహనంగానే జీవితం సాగిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తున్నది. ధరలు పెరగడాన్ని మోడీ, నిర్మలా సీతారామన్‌ తదితరులు సమర్థించుకుం టున్నారు. మన చేతుల్లో ఏవిూ లేదంటున్నారు. విదేశాల నుంచి మనం ఆయిల్‌ దిగుమతి చేసుకుంటు న్నాం కనుక..ధరలతో పాలకులకు సంబంధం లేదన్న వాదనను బాగా ప్రచారం చేస్తున్నారు. పెట్రోధరల ప్రభావం సమస్త జీవన రంగాలపైనా పడుతున్నా ప్రజలు భరిస్తున్నారు. పెట్రో ధరల పెంపు ద్వారా నిత్యవాసర సరుకులు, రవాణా వ్యవస్థలు భారం అవుతున్నా భరించాడం మన విధి అన్న రీతిలో సాగుతున్నారు. ఈ విషయంలో మోడీ ధోరణి మాత్రం నిరంకుశంగా ఉంటోంది. విమానయాన రంగం కరోనా దెబ్బతో ఇప్పటికే కుదేలయ్యింది. అనేక సంస్థలు మూతపడ్డాయి. వేలాదిమంది విమానయానరంగ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వాటిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో
పాటు..ఉన్న ఎయిర్‌ ఇండియాను కూడా అప్పనంగా అమ్మకానికి పెట్టింది. మోడీ పబ్లిక్‌ రంగస్థంస్థలు కుదేలవుతున్నాయి. ఎల్‌ఐసి, విశాఖ ఉక్కు లాంటి సంస్థలు కనుమరుగగు కాబోతున్నాయి. వాహన ఇంధన ధరలకు పట్టపగ్గాలు లేకుండా పోవడంతో సరుకు రవాణా ఛార్జీలు భారీగా పెరిగాయి. దీంతో నిత్యాసవర ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎంత నిట్టూరుస్తున్నా, ప్రతిపక్షాలు ఎంతగా విమర్శలు గుప్పిస్తున్నా, పెట్రోలు ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ధరలు పెరగడం అన్నది సహజ పరిణామం గా పాలకులు వల్లిస్తున్నారు. అంతేనా అంటే విూ హయాంలో పెంచలేదా అని కిందిస్థాయి నేతలంతా వంతపాడుతున్నారు. సాధారణంగా చమురు ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలతో ముడిపడి ఉంటాయి. కానీ, కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ ధరలు అతి తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ భారతదేశంలో మాత్రం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంటే అంతర్జాతీయ స్థాయి ధరలతో మనకు సంబంధం లేదని రుజువయ్యింది. కరోనా సమయంలో అంతర్జాతీయంగా బ్యారెల్‌ ధరలు తగ్గినా..వినియోగం పడిపోయినా ధరలు మాత్రం దిగి రాలేదు. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా ప్రత్యేక ఆదాయాన్ని సమకూర్చుకోవడం ఒక విధానంగా మారిందని ఇప్పటికే జనాలకు అర్థం అవుతోంది. దిగుమతి ధరలు తగ్గినప్పటికీ, ఆ తగ్గుదల వినియోగదారులకు చేరకుండా ఆ మేరకు పన్నులను సుంకాలను విధించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న వ్యాపార ఎత్తుగడను పాలకులు అవలంబిస్తున్నారు. జిఎస్టీని ప్రవేశపెడుతున్న సమయంలో పన్నుల పంపకాలపై విస్తృత చర్చ జరిగింది. రాష్టాల్రు ఆదాయం కోసం ఎక్కువగా ఆధారపడే వాటిల్లో ..ఒకటి చమురు ఉత్పత్తులు, రెండోది మద్యం. కేంద్రం విధించే ఎక్సైజ్‌ డ్యూటీకి అదనంగా తాము కూడా సుంకాలు విధించే అవకాశం పెట్రోల్‌, డీజిల్‌ విషయంలో ఉన్నది. మద్యం అయితే పూర్తిగా రాష్ట్ర వ్యవహారం. ఈ రెంటిని జిఎస్టి పరిధిలోకి తెస్తే, తమ ఆదాయం తగ్గి ఇబ్బందులు పడతామని రాష్టాల్రు వాదించాయి. ఫలితంగా, మినహాయింపు పొందిన సరుకులలో పెట్రోలు, డీజిల్‌, మద్యం చేరాయి. పెట్రో ధరలను జిఎస్టి పరిధిలోకి వస్తే ధరలు ఇంతగా ఉండవన్న వాదన ఉంది. అయితే దీనివల్ల రాష్టాల్రకు నేరుగా వచ్చే పెట్రో ఆదాయం పోతుందన్న వాదనతో అడ్డుకుంటున్నాయి. ప్రజలను నిట్టనిలువునా దోచుకునే పన్నలు విధానం పోవాలి. అప్పుడే ప్రజలు బతికి బట్టగలరని గుర్తించాలి.