యుద్ధం మొదలయ్యాక మేల్కొన్నారు


` భారతీయుల తరలింపుకు ముమ్మర చర్యలు
` సరిహద్దుల్లో ఇక్కట్లు పడుతున్న పలువురు
` తమకు తిండి కూడా దొరకడం లేదంటూ ఆందోళన
న్యూఢల్లీి,ఫిబ్రవరి 28(జనంసాక్షి): ఉక్రెయిన్‌`రష్యా యుద్ధంతో విదేశీయులు ముఖ్యంగా అక్కడ విద్యాభ్యాసం కోసం వెళ్ళిన భారతీయులు నానా అవస్థలు పడుతున్నారు. తెలుగు విద్యార్ధులు నానా కష్టాలు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. కరీంనగర్‌ జిల్లా రామచంద్రాపురం ప్రాంతానికి చెందిన యువతి కడారి సుమాంజలి ఉక్రెయిన్‌ లో ఇక్కట్లు పడుతోంది. ఆమె అవస్థలు అన్నీ ఇన్నీకావు. 4 రోజుల నుంచి ఆహారం కూడా లేదని ఆమె ఆవేదన చెందుతోంది. కూతురి కష్టాలు చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఎంబసీ అధికారులు భోజన సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. తమ కూతురు రూంలో వుందన్నారు సుమాంజలి తల్లి. అక్కడి పరిస్థితి బాంబులు పడుతున్నాయి. ఎయిర్‌ పోర్ట్‌ లో వున్నా.. సరైన వసతి లేదు. బోర్డర్‌ రావడానికే అవకాశం లేదంటోంది సుమాంజలి. బాంబు చప్పుడు వినిపిస్తే బంకర్లలోకి వెళుతున్నారు. షాపుల్లో ఏం దొరకడం లేదన్నారు. కేంద్రం వెంటనే స్పందించాలని, క్షేమంగా ఇంటికి చేర్చాలంటున్నారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ లో సుమాంజలి ఇరుక్కుపోయింది. అక్కడినించి సరిహద్దులు దాటాలంటే 800 కిలోవిూటర్లు దూరం వుందన్నారు సుమాంజలి అన్న. మరోవైపు కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌ గంగ కొనసాగుతోంది. బుడాఫెస్ట్‌ నుంచి ఢల్లీికి చేరుకుంది ప్రత్యేక విమానం. ఢల్లీికి చేరుకున్నారు 240 మంది భారతీయులు. ఇప్పటి వరకు ఉక్రెయిన్‌ నుంచి 1346 మంది భారతీయులను తరలించారు.
నా సోదరుడిని బయటకు లాగి, కొట్టారు..
దిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ.. ఐరాస భద్రతా మండలి చేసిన తీర్మానానికి భారత్‌ దూరంగా ఉంది. ‘దౌత్యమార్గాలు, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇరు దేశాలు బెలారస్‌ సరిహద్దుల్లో చర్చలకు అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నాం’ అంటూ అంతర్జాతీయ వేదికపై భారత్‌ విదేశాంగ విధానంలో స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. ఈ సమయంలో ఇరు దేశాలకు సంబంధించిన భద్రతాపరమైన ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇలా మనదేశం ఖండన తీర్మానానికి దూరం కావడం వల్ల ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సరిహద్దు ప్రాంతంలో వేచిచూస్తోన్న విద్యార్థులపై ఉక్రెయిన్‌ భద్రతా సిబ్బంది దాడి చేస్తోన్న వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఐదు రోజుల క్రితం రష్యా సైనిక పోరును ప్రారంభించగా.. ఆ వెంటనే ఉక్రెయిన్‌ గగనతలాన్ని మూసివేసింది. దాంతో అక్కడున్న విద్యార్థుల్ని తీసుకువచ్చేందుకు భారత్‌ చేస్తోన్న ప్రయత్నాలకు చుక్కెదురైంది. ఆ తర్వాత ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. దానిలో భాగంగా భారతీయ పౌరులు పశ్చిమ సరిహద్దుల్లోని పొరుగుదేశాలకు చేరుకుంటున్నారు. ఆ క్రమంలో వారు ఎముకలుకొరికే చలిలో గంటలకొద్దీ వేచిచూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కాగా, అక్కడ వేచి ఉన్న విద్యార్థుల్ని ఉక్రెయిన్‌ సిబ్బంది కాళ్లతో తంతున్నారని, కొడుతున్నారని, ఈడ్చేస్తున్నారని ఓ విద్యార్థిని వెల్లడిరచారు. తమ దగ్గర ఉన్న ఫోన్లను లాక్కున్నారన్నారు. మొదట సరిహద్దు దాటి పొలండ్‌లోకి వెళ్లడానికి అనుమతించి, తర్వాత నిరాకరించారని వాపోయారు. ‘నేను, నా సోదరుడు, స్నేహితులతో కలిసి ఉక్రెయిన్‌ సరిహద్దు వద్ద వేచిచూస్తున్నాం. అక్కడి సిబ్బంది మమ్మల్ని వరుసలో నిల్చోమన్నారు. తర్వాత అమ్మాయిలంతా ఒక వరుసలో నిల్చోవాలని చెప్పారు. మేం అలాగే చేశాం. తర్వాత నేను సరిహద్దు దాటడానికి అనుమతించారు. నేను సరిహద్దు దాటగా.. నా సోదరుడు ఉక్రెయిన్‌వైపు ఉండిపోయాడు. నేను కూడా వరుసలో ఉన్నానని నా సోదరుడు చెప్పగా.. అతడిని బయటకు లాగి, లాఠీతో కొట్టారు. సరిహద్దు వద్ద ఉక్రెయిన్‌ అధికారులతో సమన్వయం చేసేందుకు ఎవరూ లేరు. అబ్బాయిల్ని దారుణంగా హింసించారు. తర్వాత అక్కడ పరిస్థితి చేయిదాటిపోవడంతో నా సోదరుడితో సహా మిగతా స్నేహితులు హాస్టల్‌కు వెళ్లిపోయారు’ అని సందీప్‌ కౌర్‌ అనే విద్యార్థిని వెల్లడిరచారు.భారత్‌ రష్యా వైపు మొగ్గుచూపడంతో కొందరు ఉక్రెయిన్‌ సిబ్బంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మరో విద్యార్థిని తెలిపారు. వారు అనుచితంగా ప్రవర్తించడానికి అదే కారణమన్నారు. ‘పోలండ్‌ సరిహద్దు తెరిచి ఉందని, ఇప్పుడు మనం వెళ్లొచ్చని భారత రాయబార కార్యాలయం సమాచారం ఇచ్చింది. దాంతో మేం ఉదయం నాలుగు గంటల సమయంలో టెర్నోపిల్‌ నుంచి బయలుదేరాం. కానీ సరిహద్దు వద్ద ఉక్రెయిన్‌ సిబ్బంది మమ్మల్ని అడ్డుకున్నారు. అప్పుడు చలి తీవ్రంగా ఉంది. మాతో ఉన్న కొందరు అనారోగ్యానికి గురయ్యారు’ అని మరో విద్యార్థి విూడియాకు తెలిపారు. ఉక్రెయిన్‌ అధికారులతో సంప్రదించేందుకు సరిహద్దు వద్ద భారత్‌ అధికారులు ఎవరూ లేరని వాపోయారు. ఇదే విషయమై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిని సంప్రదించగా.. స్పందించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌`పొలండ్‌ సరిహద్దుల వద్ద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటోన్న వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని షేర్‌ చేస్తూ.. విపక్షాలు కేంద్రంపై విమర్శలు చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాటిని పోస్టు చేస్తూ.. కేంద్రం తక్షణ సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. ‘సరిహద్దుల వద్ద భారత విద్యార్థులు ఎదుర్కొంటోన్న పరిస్థితులను చూసి తట్టుకోలేపోతున్నాను. కేంద్రం వెంటనే తరలింపు ప్రక్రియ ప్రణాళికను విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పంచుకోవాలి. మన ప్రజల్ని మనం వదులుకోలేం’ అని వ్యాఖ్యానించారు. సైనిక పోరుతో వణికిపోతున్న మరో యువతికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ట్వీట్‌ చేశారు. విద్యార్థులందరిని సురక్షితంగా తీసుకురావాలని ఆమె కోరారు.
అది సహాయం కాదు.. మన బాధ్యత: వరుణ్‌ గాంధీ
‘కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల 15 వేల మందికి పైగా విద్యార్థులు రణరంగంలో చిక్కుకుపోయారు. దౌత్యపరమైన, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వారు తిరిగి వచ్చేలా చూడటం మన బాధ్యత. అది మనం వారికి సహాయం చేస్తున్నట్లు కాదు.. బాధ్యత నిర్వహించడం మాత్రమే. ప్రతి విపత్తులోనూ అవకాశాన్ని వెతుక్కోకూడదు’ అని భాజపా నేత వరుణ్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. అలాగే ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఓ విద్యార్థిని వీడియోను షేర్‌ చేశారు.
శంషాబాద్‌ చేరుకున్న 11మంది తెలుగు విద్యార్థులు
ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి బయల్దేరిన 11 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్‌కు చేరుకున్నారు. ఉక్రెయిన్‌ నుంచి తొలుత విమానంలో ముంబయి చేరుకున్న వీరంతా.. అక్కడి నుంచి తాజాగా శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. విద్యార్థుల్ని చూసి వారి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు.