యూపి అభివృద్ది కనువిప్పు కావాలిసుల్తాన్‌పూర్‌ వస్తే అభివృద్ది కనిపిస్తుంది

పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన ప్రధాని మోడీ

లక్నో,నవంబర్‌16(జనం సాక్షి ): విమర్శలు చేస్తున్న వారికి యూపిలో జరుగుతున్న అభివృద్ది సమాధానం కాగలదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే అభివృద్ది అంటే ఏమిటో కనపిస్తుందన్నారు. పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు.  ఉత్తరప్రదేశ్‌లో పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన అనంతరం సుల్తాన్‌ పూర్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో నుంచి ఘాజీపూర్‌ వరకు 340.8 కిలోవిూటర్ల పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. ఎక్స్‌ప్రెస్‌వేపై 3.2 కిలోవిూటర్ల ఎయిర్‌ స్టిప్ర్‌ కూడా తయారు చేసారు. ఎయిర్‌స్టిప్ర్‌ వద్ద గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రధానికి స్వాగతం పలికారు. యుద్ధ విమానాలను అత్యవసరంగా ల్యాండిరగ్‌ చేసేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్‌వేపై 3.2 కిలోవిూటర్ల ఎయిర్‌స్టిప్ర్‌ నిర్మించారు. 341 కిలోవిూటర్ల ఎక్స్‌ప్రెస్‌వే రాష్ట్ర రాజధాని లక్నోను ఘాజీపూర్‌తో కలుపుతుంది. రూ. 22,500 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మించారు.  ఎయిర్‌స్టిప్ర్‌ వేదిక నుండి ప్రధాని వివిధ విమానాల ద్వారా ఎయిర్‌ షోను తిలకించారు. రాష్ట్ర అభివృద్ధికి ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిదర్శనమని తెలిపారు. ఇది అత్యాధునిక రహదారి అని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెప్పారు. సుల్తాన్‌పూర్‌ జిల్లాలోని కర్వాల్‌ ఖేరిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్‌, ఆ రాష్ట్ర ప్రజల సత్తాపై ఎవరికైనా సందేహాలుంటే, సుల్తాన్‌పూర్‌ వచ్చి నిజాలు తెలుసుకోవాలన్నారు. మూడు, నాలుగేళ్ళ క్రితం ఓ సాధారణ భూమి ఉన్న చోట ఇప్పుడు అత్యాధునిక ఎక్స్‌ప్రెస్‌వే వచ్చిందన్నారు. గత ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలోని తూర్పు ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయన్నారు. దేశ భద్రత గురించి పట్టించుకోనివారికి పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న ఎయిర్‌స్టిప్ర్‌ గట్టి సందేశం పంపుతుందని చెప్పారు. కాలనేమి అనే రాక్షసుడిని చంపిన హనుమంతుడికి నమస్కరిస్తూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇక్కడ 3.2 కిలోవిూటర్ల విస్తీర్ణంలో ఓ వైమానిక స్థావరాన్ని నిర్మించారు. అత్యవసర సమయాల్లో భారత వాయు సేన విమానాలు ఇక్కడ దిగుతాయని అన్నారు. ఇదే సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు. కేంద్రంలో, ఉత్తరప్రదేశ్‌లో ఏండ్లుగా వంశ పాలన కొనసాగిందని, కుటుంబపాలనల్లో యూపీ ప్రజల ఆకాంక్షలు అణిచివేతకు గురయ్యాయని ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో ఏండ్లుగా ఉత్తమాటలు చెప్పే ప్రభుత్వాలను చూశాం. గత ప్రభుత్వాలు రోడ్‌ కనెక్టివిటీ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలకు పారిశ్రామిక ప్రగతి గురించి కల్లబొల్లి మాటలు చెప్పాయి. దాంతో మౌలిక సదుపాయాల కొరత ఏర్పడి ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. గత ప్రభుత్వాలు ప్రజల బాగోగులు పట్టించుకోలేదు. రాష్ట్రంలో ఎప్పుడూ విద్యుత్‌ కోతలు ఉండేవి. శాంతిభద్రతల పరిస్థితి సరిగా ఉండేది కాదు. అంతేగాక గత ముఖ్యమంత్రులు తమ ఇండ్లు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే అభివృద్ధి చేసేవారు అని ప్రధాని వ్యాఖ్యానించారు. అభివృద్ధి అనేది అంతటా ఒకేలా జరుగాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి జరగడం, మరికొన్ని ప్రాంతాలు దశాబ్దాలుగా వెనుకబడిపోవడం ఏ దేశానికైనా మంచిది కాదన్నారు. ఇప్పుడు కేంద్ర, రాష్టాల్లో ఒకే పార్టీ ప్రభుత్వం ఉన్నదని, ఈ డబుల్‌ ఇంజిన్‌ గవర్నమెంట్‌ హయాంలో అభివృద్ధి వేగంగా జరుగుతున్నదని అన్నారు. కొంతమంది తాము చేస్తున్న అభివృద్ధి ఓర్వలేక అసహనం వ్యక్తం చేస్తున్నారని, అది సహజమేనని మోదీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. యూపీలో గత సర్కారు తనకు సహకరించలేదని, తనతో కలిసి నిలబడితే వాళ్ల ఓటు బ్యాంకు దెబ్బతింటుందనే భయం వారిలో కనిపించేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌,సిఎం యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌ పాల్గొన్నారు.