యూపీ, బీహార్‌లో..  భాజపాకు ఘోర పరాభవం తప్పదు


– యూపీలో బీఎస్పీ, ఎస్పీ కూటమిని ప్రజలు స్వాగతిస్తారు
– రాజ్యాంగాన్ని పక్కకుపెట్టి.. నాగ్‌పూర్‌ చట్టాలను అమలుకు యత్నిస్తున్నారు
– మాయవతిని కలిసిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌
లక్నో, జనవరి14(జ‌నంసాక్షి) : యూపీ, బీహార్‌లలో త్వరలో జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపాకు ఘోర పరాభవం తప్పదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ అన్నారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని  తేజస్వీ యాదవ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఎదుర్కొవడానికి ఎస్పీ, బీఎస్పీలు ఒకటిగా పోటీ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి
తెలిసిందే. ఆ మరుసటి రోజే తేజస్వీ, మాయావతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా బీఎస్పీ, ఎస్పీ కూటమి కట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో తేజస్వీ మాట్లాడుతూ.. బాబా సాహెబ్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని పక్కకుపెట్టిన భాజపా నాగ్‌పూర్‌ చట్టాలను అమలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. అఖిలేశ్‌, మాయావతి కలయికను ప్రజలు కూడా స్వాగతిస్తున్నట్టు తెలిపారు. యూపీలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. యూపీలో భాజపా ఓడిపోవడం ఖాయమని, ఆపార్టీ కనీసం ఒక్కసీటు కూడా గెలవలేదన్నారు. తన తండ్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా ఇదే కోరుకున్నారని, భాజపాను ఓడించేందుకు యూపీలోనూ బిహార్‌ తరహా మహాకూటమి ఏర్పడాలని తరచూ చెప్పేవారని తేజస్వీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపాపై పోటీకి ఎస్పీ, బీఎస్పీలు కలిసిసై అంటున్నాయి. శత్రుత్వాన్ని మరచి మహాకూటమిగా ఏర్పడ్డాయి. శనివారం ఈ విషయాన్ని మాయావతి, అఖిలేశ్‌ సంయుక్త విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి అధికారికంగా ప్రకటించారు. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా, చెరి 38 సీట్లలో పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. అయితే ఈ కూటమిలో కాంగ్రెస్‌కు చోటివ్వకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోనప్పటికీ రాహుల్‌, సోనియాలు పోటీ చేసే అమేథీ, రాయ్‌బరేలీల్లో అభ్యర్థులను నిలబెట్టబోమని తెలిపారు. మరో రెండు స్థానాలను చిన్న భాగస్వాములకు కేటాయిస్తామని చెప్పారు. కాగా ఎస్పీ-బీఎస్పీ కూటమిపై స్పందించిన కాంగ్రెస్‌ పార్టీ.. యూపీలో ఒంటరిపోరుకు సిద్ధమని ప్రకటించింది.