‘యో-యో’ టెస్టుకు అందరూ రావాల్సిందే..!
– క్రికెటర్లకు బీసీసీఐ ఆదేశం
ముంబయి, జూన్2(జనం సాక్షి) : సొంతగడ్డపై అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లకు యో-యో టెస్టు నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిర్ణయించింది. అఫ్గాన్‌తో టెస్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ బెంగళూరులో జూన్ 8న నిర్వహించే యో-యో టెస్టుకు హాజరుకావాలని సూచించింది. తప్పనిసరిగా పాల్గొనాల్సిన యో-యో పరీక్షలో ప్లేయర్స్ అంతా పాల్గొనాల్సిందే. అఫ్గాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు జట్టును ఎంపిక చేసినప్పటికీ, ప్రతి ఆటగాడు ఈ విధానాన్ని అనుసరించాల్సి ఉంది. వచ్చే కొన్ని వారాల్లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న ఆటగాళ్లు కూడా పరీక్షను ఎదుర్కోవాల్సి ఉందని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. అంతేకాదు ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లే ఇండియా-ఏ జట్లు కూడా పరీక్షకు హాజరుకావాలి. దాదాపు రెండు నెలల పాటు ఐపీఎల్‌లో బిజీగా గడిపిన ఆటగాళ్లకు పదిరోజుల పాటు విశ్రాంతి లభించింది. నేషనల్ క్రికెట్ అకాడవిూలో త్వరలో నిర్వహించనున్న క్యాంపులో ఆటగాళ్లు పాల్గొని సాధన చేయనున్నారు. యో-యో టెస్టులో ఆటగాళ్లు నిర్దేశించిన ప్రమాణాలను అందుకోవాల్సి ఉంటుంది. ఇందులో కచ్చితంగా పాస్ అవ్వాల్సిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ప్రసాద్ ఏమాత్రం రాజీపడడం లేదు.