రాజకీయాల్లోకి సుమలత?

– అంబరీష్‌ సంస్మరణ సభలో ప్రస్తావన
– అభిమానుల నుంచి భారీ స్పందన
తిరువనంతపురం, జనవరి14(జ‌నంసాక్షి) :  సౌతిండియాలో ఒకప్పటి టాప్‌ హీరోయిన్‌, ప్రముఖ కన్నడ నటుడు దివంగత అంబరీష్‌ సతీమణి సుమలత రాజకీయాల్లోకి అడుగిడనున్నారు.. దీనికి సంబంధించి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది.. సుమలత తెలుగు, కన్నడ, తమిళ ఇండస్ట్రీస్‌లో టాప్‌ హీరోయిన్‌గా నిలిచారు.. కన్నడ హీరో అంబరీష్‌ను పెళ్లాడారు.. వీరికి కుమారుడు ఉన్నారు.. అంబరీష్‌ సినీహీరోగానే కాకుండా రాజకీయ నేతగాను మంచిపేరు సంపాదించారు.. ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కాగా ఇటీవల అనారోగ్యకారణాలతో కాలంచెందారు.. ఇదిలా ఉంటే ఆదివారం మండ్యలో జరిగిన అంబరీష్‌ సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో అంబరీష్‌ రాజకీయ వారసురాలిగా సుమలత రంగప్రవేశం చేస్తున్నారని హల్‌చల్‌ చేశారు. అంబరీష్‌ ఆశయాలు నెరవేరాలంటే ఆమె రాజకీయాల్లోకి రావాలని నినదించారు.. సంస్మరణ సభకు పార్టీలకు అతీతంగా చాలామంది హాజరయ్యారు. సినీ హీరో దర్శన్‌, నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌, సీనియర్‌ నటుడు దొడ్డణ్ణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుమలత రాజకీయాల్లోకి రావాలని ప్రతిపాదించారు. దీంతో అంబరీష్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ
పెద్దయెత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఇవ్వకపోతే జేడీఎస్‌ నుంచి, లేకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలిపించుకుంటామని వారు నినాదాలు చేశారు. సుమలత కుమారుడు, సినీ హీరో అభిషేక్‌ సైతం తన తల్లి ఎన్నికల్లో పోటీ చేయడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. అయితే ఈ సభలో పాల్గొన్న సుమలత ఈ ప్రతిపాదనను వ్యతిరేకించకపోవడంతో ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉందని అందరూ భావిస్తున్నారు. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.