రాజధానిలో కదం తొక్కిన రైతన్న..

రుణమాఫీ, పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతుల డిమాండ్‌
– ఢిల్లిలో రెండు రోజుల రైతుల నిరసన  ప్రదర్శనలు
న్యూఢిల్లీ,నవంబర్‌ 29(జ‌నంసాక్షి): దేశ రాజధానిలో రైతులు కదం తొక్కారు. రామ్‌లీలా మైదాన్‌ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. రుణ మాఫీ కల్పించాలని, పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రెండు రోజుల నిరసన ప్రదర్శన చేపట్టారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. రాబోయే పార్లమెంట్‌ సమావేశంలో రెండు బిల్లులు ప్రవేశపెట్టాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. గత సమావేశాల్లో ఆ రెండు బిల్లులను ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లులుగా ప్రవేశపెట్టారు. ఆ బిల్లులకు 21 పార్టీలు మద్దతు తెలిపాయి. ఇవాళ తమిళనాడుకు చెందిన రైతులు ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ధర్నా చేశారు. కొంత సేపు వాళ్లు రైళ్లను నిలిపేశారు. గత ఏడాది జంతర్‌ మంతర్‌ వద్ద వంద రోజుల పాటు రైతులు ఆందోళన నిర్వహించారు. ఢిల్లీలో అయిదు ప్రాంతాల నుంచి సుమారు పదివేల రైతులు రామ్‌లీలా మైదాన్‌కు చేరుకుంటున్నారు. రైతుల రెండు రోజుల ర్యాలీలో భాగంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు గురువారం స్థానిక రామ్‌లీలా మైదానానికి భారీగా చేరుకున్నారు. శుక్రవారం పార్లమెంటు స్ట్రీట్‌  వైపుగా ఈ ర్యాలీ కొనసాగుతుందని ఎఐకెఎస్‌సిసి పేర్కొంది. వివిధ ప్రాంతాల నుండి రైతులు గురువారం రామ్‌లీలా మైదానానికి చేరుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎఐకెఎస్‌సిసి వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై చర్చలు జరుపుందని
పేర్కొన్నారు. కాగా, రైతుల ర్యాలీకి అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకల్లా వివిధ ప్రాంతాల నుండి రైతులు రామ్‌లీలా మైదానానికి చేరుకుంటారని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ఢిల్లీ యూనిట్‌ కార్యకర్త కమలా తెలిపారు. దేశవ్యాప్తంగా 15 ఏళ్లలో మూడు లక్షలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వాలు వారిని మోసం చేస్తూనే ఉన్నాయని కిసాన్‌ ముక్తి మార్చ్‌ పేర్కొంది. వ్యవసాయ సంక్షోభం గురించి చర్చించేందుకు, రుణమాఫీ, పంట ఉత్తత్తులకు కనీస మద్దతు ధరను కల్పించే రెండు ప్రైవేట్‌ బిల్లులను సభ్యులు ఆమోదించడానికి వీలుగా పార్లమెంటులో 21 రోజుల పాటు ప్రత్యేక సెషన్‌ను నిర్వహించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. సిపిఎం, ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ఆధ్వర్యంలో ఈ రెండు రోజల ర్యాలీకి అఖిల భారత కిసాన్‌ సంఘర్ష్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ (ఎఐకెఎస్‌సిసి) కి చెందిన 200 సంఘాల మద్దతు ఉన్నట్లు పేర్కొంది.