రాజస్థాన్‌లో ఎనలేని అభివృద్ది

గెలపిస్తే వలసదారులను వెనక్కి పంపిస్తాం
ప్రచారంలో బిజెపి అధ్యక్షుడు షా
జయపుర,నవంబర్‌27(జ‌నంసాక్షి): కేంద్రంలో, రాజస్థాన్‌లో మరోసారి తమ పార్టీని గెలిపిస్తే అక్రమ వలసదారులందరినీ వెనక్కి పంపించేస్తామని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తెలిపారు. అసోంలో కొన్ని నెలల క్రితం ఆ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ పౌర రిజిస్టర్‌ ముసాయిదాను విడుదల చేయగా అందులో 40 లక్షల మంది పేర్లు లేవని తెలిసిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌ శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్‌ షా.. ఈ విషయాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘ఈ పక్రియను ఇకపై కూడా కొనసాగించాలని మేము నిర్ణయం తీసుకున్నాము. డిసెంబరు 7న జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ భాజపానే గెలిపించండి. అక్రమ వలసదారులను వెనక్కి పంపాలన్న లక్ష్యం నెరవేరుతుంది. 1971 నుంచి వలసదారులు అసోంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నారు. దశాబ్దాల తరబడి దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ దీన్ని అడ్డుకోలేదు. ఆ పార్టీ దేశ ప్రజల కంటే అక్రమవలసదారులపైనే అధిక శద్ధ చూపుతోంది’ అని విమర్శించారు. 2004 నుంచి 2014 వరకు కొనసాగిన కాంగ్రెస్‌ దుష్పరిపాలన కొనసాగింది. ప్రస్తుతం కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో వసుంధర రాజె ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కలలు కంటున్నారు. రాజస్థాన్‌లో మరోసారి అధికారం చేపట్టడానికి భాజపా సిద్ధంగా ఉంది’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ఎన్డీఏ సర్కారు దేశ భద్రత విషయంలో ఎన్నో చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ‘మన సైనికుల ప్రాణాలు తీసినందుకుగానూ ప్రతీకారంగా మనం పీవోకేలో మెరుపుదాడులు చేశాం. ఇటువంటి దాడులను అంతకు ముందు వరకు అమెరికా, ఇజ్రాయెల్‌ మాత్రమే చేశాయి. ఇప్పుడు మనమూ ఆ జాబితాలో ఉన్నామని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌కి యూపీఏ హయాంలో రూ.1,09,000 కోట్లు మాత్రమే అందాయి. కానీ, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.2,65,000 కోట్ల నిధులను అందించాము. రాష్ట్రంలో మరోసారి భాజపాయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 2014 లోక్‌సభ ఎన్నికల తరువాత జరిగిన మహారాష్ట్ర, హరియాణా, అసోం, మణిపూర్‌, మేఘాలయా, నాగాలాండ్‌, త్రిపుర, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో భాజపాయే విజయం సాధించింది’ అని అమిత్‌ షా తెలిపారు.