రాజస్థాన్‌ సీఎంగా..  అశోక్‌ గెహ్లాట్‌ ప్రమాణస్వీకారం 


– హాజరైన రాహుల్‌, చంద్రబాబు, పలు రాష్ట్రాల ముఖ్యనేతలు
జైపూర్‌, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గ¬్లత్‌ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. జయపురలోని చారిత్రక ఆల్బర్ట్‌ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గ¬్లత్‌ చేత గవర్నర్‌ కల్యాణ్‌ సింగ్‌ ప్రమాణం చేయించారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే, పుదుచ్చెరీ, పంజాబ్‌, కర్ణాటక ముఖ్యమంత్రులు నారాయణస్వామి, అమరీందర్‌ సింగ్‌, కుమారస్వామి, మాజీ ప్రధాని దేవేగౌడ, హరియాణా మాజీ సీఎం భూపిందర్‌ సింగ్‌ హుడా, రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, ఇతర కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు హాజరయ్యారు. కాగా.. అనివార్య కారణాల వల్ల బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాలేకపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 99 సీట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపాకు 73, బీఎస్పీ 6, స్వత్రంత్రులు 13, ఇతరులు 8 చోట్ల విజయం సాధించారు. మెజార్టీకి కేవలం ఒకేఒక్క స్థానం తక్కువగా ఉన్న కాంగ్రెస్‌ చిన్న పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ అంగీకరించారు. దీంతో గ¬్లత్‌ నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.