పార్టీకి, పదవులకు రాజీనామా
– టీ కాంగ్రెస్ ఎంపీల నిర్ణయం
– స్పీకర్ ఫార్మాట్‌లోనే లేఖలిస్తాం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తామని కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. సోమవారం ఎంపీ వివేక్ నివాసంలో భేటీ అయి సుశీల్‌కుమార్ షిండే, గులాంనబీ ఆజాద్‌ల ప్రకటనల తదనంతర పరిణామాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ సాగదీతకే మొగ్గుచూపడాన్ని ఇక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఎంపీలు పేర్కొన్నారు. ప్రజల మనోభావాల మేరకే తాము పదవులు వదులకోవాలని నిర్ణయించామన్నారు. ఇంకా పదువులు పట్టుకు వేలాడితే తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతామనే బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. మంగళవారం తమ రాజీనమానలను స్పీకర్‌కు అందజేస్తామన్నారు. రాజీనామాలపై ఎవరికీ ఎలాంటి సందేహాలు వద్దని, స్పీకర్ ఫార్మాట్‌లోనే లేఖలు సమర్పిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.