రాఫెల్‌, కావేరీ జల వివాదంపై..  చర్చకు పట్టుబట్టిన సభ్యులు


– మంగళవారానికి రాజ్యసభను వాయిదావేసిన చైర్మన్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది.. సభలు ప్రారంభమైన నాటి నుంచి ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో రాజ్యసభ వాయిదా పడుతూనే ఉంది. దీనిలో భాగంగా సోమవారం ఐదోరోజు కూడా సభకు అంతరాయం కలిగింది. సోమవారం సభ ప్రారంభమయ్యాక రాఫేల్‌ ఒప్పందం, కావేరీ సమస్యలపై సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో కొద్ది నిమిషాలకే ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను మంగళవారానికి వాయిదా వేశారు. కర్ణాటక, తమిళనాడు మధ్య ఉన్న నీటి వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేస్తూ డీఎంకే, అన్నా డీఎంకే ఎంపీలు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. మరోవైపు రఫేల్‌ ఒప్పందంలో సుప్రీం కోర్టును ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని, ఈ వ్యవహారంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ అజాద్‌ డిమాండ్‌ చేశారు. దీనిపై ఇప్పటికే తాను నోటీసు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈయన తీరును ఖండించిన అధికార సభ్యులు నినాదాలు చేశారు. రాఫేల్‌ ఒప్పందంపై సుప్రీంకోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చినా చర్చకు పట్టుబడుతుండడంపై క్షమాపణలు కోరారు. ఈ నిరసనల మధ్యే రాజ్యసభ వాయిదా పడింది. రాజ్యసభ ప్రారంభం కాగానే తొలుత ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ పోటీలో షట్లర్‌ పీవీ సింధూ బంగారు పతకం సాధించడంపై రాజ్యసభ అభినందనలు తెలిపింది.