రాఫెల్‌ రగడ!


– మోడీ నిర్ణయంతో రాఫెల్‌ ధరలు 41శాతం పెంపు
– ఫ్రాన్స్‌ ఒక్కో విమానానికి రూ.1319 కోట్లు చెల్లిస్తే
– భారత్‌ రూ.1670 కోట్లు చెల్లించింది
– జాతీయ ప్రముఖ దినపత్రికలో కథనం
– కథనంతో రాజకీయ వర్గాల్లో దుమారం
న్యూఢిల్లీ, జనవరి18(జ‌నంసాక్షి) : రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ఎన్డీయే ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తుంది. పార్లమెంట్‌ వేదికగానూ కేంద్రం రాఫెల్‌ విమానాల కొనుగోలుపై చేసుకున్న ఒప్పందాలపై కాంగ్రెస్‌ నిలదీసింది. మోదీ రాఫెల్‌ ఒప్పందంతో వందల కోట్లు వెనకేసుకున్నాడని రాహుల్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సమయంలో రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహరం మళ్లీ సంచలనం రేపుతోంది. రాఫెల్‌ యుద్ధ విమానాల కోనుగోలుపై కేంద్రం నిర్ణయం తీసుకోగానే ధరలు 41 శాతానికి పెంచారని ప్రముఖ దినపత్రిక ‘ది హిందూ’ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక చైర్మెన్‌ ఎన్‌ రామ్‌ స్వయంగా ఈ కథనం రాయడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపింది. రాఫెల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని యూపీఏ ప్రభుత్వం 126 విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు రూ.54 వేల కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. అంటే, అప్పటి కరెన్సీ ధరల ప్రకారం ఒక్కో యుద్ధ విమానం దాదాపు రూ.526 కోట్లు. ఎన్నికల్లో యూపీఏ ఓడిపోయి, ఎన్డీయే సర్కారు వచ్చింది. 126 యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత, ప్రధాని మోడీ ఫ్రాన్స్‌ వెళ్లారు. ఫ్రాన్స్‌ నుంచి 36రాఫెల్‌ విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ఆకస్మికంగా ప్రకటించారు. ఇందుకు దాదాపు రూ.58వేల కోట్లు చెల్లించేందుకు ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే, ఒక్కో యుద్ధ విమానం ఖరీదు దాదాపు రూ.1670 కోట్లు. ఈజిప్టు, ఖతార్‌ దేశాలు కూడా ఫ్రాన్స్‌ నుంచి చెరో 24 యుద్ధ విమానాలు కొనుగోలు చేశాయి. ఒక్కో యుద్ధ విమానానికి అవి చెల్లించిన ధర సుమారు రూ.1319 కోట్లు. యూపీఏ సర్కారు 2012లో ఒప్పందం కుదుర్చుకుంటే.. ఈజిప్టు, ఖతార్‌లు 2015లో మోడీ ప్రభుత్వం 2016లో ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇదే డిమాండ్‌ చేస్తోంది. ఒప్పందం వివరాలను బయట పెట్టాలని డిమాండ్‌ చేస్తుంది.