రాఫేల్‌పై కాంగ్రెస్‌ తప్పుదోవ పట్టించింది

– కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌
ముంబయి, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : రాఫెల్‌పై కాంగ్రెస్‌ తప్పుడు సమాచారంతో ప్రజల్లో గందరగోళాన్ని నింపే ప్రయత్నం చేసిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మరోసారి కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యుద్ధ విమానాల ధరపై కాంగ్రెస్‌ తెలిసే ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆమె దుయ్యబట్టారు. ‘రాఫేల్‌ ధర వివరాలను మేం కాగ్‌కు సమర్పించామని, కాగ్‌ కూడా ఆ వివరాలను పరిశీలించిందన్నారు. ఆ తర్వాతే నివేదికను పార్లమెంటరీ వ్యవహారాల కమిటీకి అందించిందన్నారు. ఈ కమిటీ దీన్ని పరిశీలించిన తర్వాతే అది పబ్లిక్‌ డాక్యుమెంట్‌ అవుతుందని, ప్రస్తుతం ఆ పక్రియ కొనసాగుతోందన్నారు. ఇవన్నీ తెలిసే రఫేల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని నిర్మలా సీతారామన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా ఆ పార్టీ పొగరుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాఫేల్‌ ఒప్పందంపై ఎలాంటి దర్యాప్తు అవసరం లేదంటూ గత శుక్రవారం సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం కొట్టిపారేసింది. అంతేగాక.. రాఫేల్‌ ఒప్పందం వల్ల ఓ ప్రయివేటు కంపెనీకి లబ్ధి చేకూరిందని చెప్పేలా ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు పేర్కొంది. అయితే ఈ తీర్పును కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు చేపట్టాల్సిందేనని డిమాండ్‌ చేస్తోంది.