రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర

ఆర్‌ఎస్‌ఎస్‌,బిజెపిల తీరుపై మండిపడ్డ కేరళ సీఎం పినరయి విజయన్‌
భక్తులే ఆలయంలోకి వెళ్లిన.. మహిళలకు అండగా నిలిచారు
సుప్రీం తీర్పును పాటించడం తప్ప.. మాకు మరోఅవకాశం లేదు
తిరువనంతపురం, జనవరి3(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లకు బీజేపీ, ఆరెస్సెస్‌లే కారణమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపించారు. మహిళలకు భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని, రాజ్యాంగపరమైన బాధ్యతను ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. 50ఏళ్లలోపు ఇద్దరు మహిళలు బుధవారం శబరిమల ఆలయంలోకి ప్రవశించి దర్శించుకున్న సంగతి తెలిసిందే. వీరికి పోలీసులు, కేరళ ప్రభుత్వం సహకరించడంపై.. కేరళ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. కాగా గురువారం బంద్‌కు పిలుపునిచ్చారు. శబరిమల కర్మ సమితి సహా పలు హిందూత్వ సంస్థలు కేరళలో చేపట్టిన ఈ బంద్‌ హింసాత్మకంగా మారింది.  పలువురు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు… శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలకు భక్తుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదని ఆయన పేర్కొన్నారు. భక్తులు స్వయంగా ఆ ఇద్దరు మహిళలకు సాయం చేశారన్నారు.  హింసకు వ్యతిరేకంగా ఆ మహిళలు వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్దంగా వ్యవహరించారన్నారు. భక్తుల సహకారంతోనే సురక్షితంగా లోపలికి వెళ్లి తిరిగి వచ్చారన్నారు.  శబరిమలను ఘర్షణలు సృష్టించేందుకు సంఘ్‌ పరివార్‌ ప్రయత్నిస్తోందని విజయన్‌ విమర్శించారు. దీన్ని కఠినంగా అడ్డుకోవడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేదని ఆయన స్పష్టంచేశారు. సంఘ్‌పరివార్‌ సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తోందనీ, నిజమైన భక్తులెవరూ సుప్రీంకోర్టు ఆదేశాలను వ్యతిరేకించడం లేదని సీఎం అన్నారు. కాగా బుధవారం పందాళంలో జరిగిన అల్లర్లలో శబరిమల కర్మ సమితి కార్యకర్త చంద్రన్‌ ఉన్నతన్‌ తీవ్రంగా గాయపడ్డాడని ముఖ్యమంత్రి తెలిపారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ… గుండెపోటు కారణంగా ఆయన మృతిచెందాడని వెల్లడించారు. ఆందోళన కారులు ఇప్పటి వరకు 7 పోలీసు వాహనాలు, 79 ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారని, 39మంది పోలీసులపై దాడిజరిగినట్టు ప్రభుత్వం వెల్లడించిందన్నారు. ప్రత్యేకించి మహిళలు, మహిళా జర్నలిస్టులపై ఆందోళనకారులు దాడులకు పాల్పడుతున్నారనీ, ఇలాంటి చర్యలను సహించేదిలేదని ముఖ్యమంత్రి విజయన్‌ ఘాటుగా హెచ్చరించారు.