రాహుల్‌ గాంధీకి కోర్టు సమన్లు

ముంబయి: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ముంబయిలోని గిర్గావ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది రఫేల్‌ ఒప్పందంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. ప్రధాని మోదీని ‘కమాండర్‌ ఇన్‌ థీఫ్‌’ అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో దాఖలైన పరువు నష్టం దావా కేసులో ఆయనకు సమన్లు పంపారు. అక్టోబరు 3న వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని ఆదేశించారు.

గత సంవత్సరం సెప్టెంబరులో పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ ‘కమాండర్‌ ఇన్‌ థీఫ్‌’ అని సంబోధించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భాజపా నేత మహేశ్‌ శ్రీమాల్‌ పరువు నష్టం దావా వేశారు. కేవలం ప్రధానినే కాకుండా భాజపా కార్యకర్తలందరినీ రాహుల్‌ అ గౌరవపరిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే పలు సందర్భాల్లో ‘కాపలాదారుడే దొంగ’అని మోదీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల్ని కూడా పిటిషనర్‌ ప్రస్తావించారు. ఫ్రాన్స్‌తో జరిగిన రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందన్నది కాంగ్రెస్‌ ప్రధాన ఆరోపణ. దీన్నే గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాహుల్‌ ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. అనేక సభల్లో ‘చౌకీదార్‌ ఛోర్‌ హై’ అంటూ మోదీపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.

 

Tags :