రాహుల్‌ ప్రధాని కాలేరు

– సోనియా విదేశీరాలు కావడమే కారణం
– మోదీని ఢీకొట్టే స్థాయి మాయవతికే ఉంది
– బీఎస్పీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
– సదరు నేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాయవతి
– పార్టీ పదవి నుంచి తొలగింపు
లఖ్‌నవూ, జులై17(జ‌నం సాక్షి ) : తమ పార్టీ అధ్యక్షురాలు మాయావతి మాత్రమే ప్రధాని నరేంద్రమోదీని ఎదుర్కోగలరని బహుజన్‌ సమాజ్‌ పార్టీ జాతీయ సమన్వయకర్త జై ప్రకాశ్‌ సింగ్‌ పేర్కొన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో మాయావతే ప్రధాన మంత్రి అభ్యర్థి అని వెల్లడించారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆ పదవి దక్కదని, ఎందుకంటే ఆయన తల్లి విదేశీయురాలు కావడమే కారణమని పేర్కొనడం గమనార్హం. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ వైఖరిని తెలియజేసేందుకు సోమవారం పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జై ప్రకాశ్‌ వివాదాస్పదంగా మాట్లాడారు.దేశ ప్రధాని అయ్యేందుకు మాయావతికి మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘కర్ణాటకలో కుమారస్వామిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడంలో మాయావతి ప్రధాన పాత్ర పోషించారని, ఎన్నికల పోరులో నరేంద్ర మోదీ, అమిత్‌షాల ప్రభావాన్ని ఆపగల ఏకైక దబాంగ్‌ నేత మాయావతి అన్నారు. కేవలం దళితుల నుంచే కాకుండా అన్నివర్గాల నుంచి ఆమెకు మద్దతు ఉందని, సమయం వస్తే ఆమే ప్రధాని అవుతారు అన్నారు. ఆమె కింది స్థాయి నుంచి వచ్చారని, నాలుగు సార్లు యూపీ సీఎంగా పనిచేశారని జై ప్రకాశ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా రాహుల్‌ పేరు ప్రస్తావనలో ఉండగా, మరోవైపు జై ప్రకాశ్‌ మాత్రం ‘రాహుల్‌ చూడటానికి ఆయన తండ్రి కంటే ఎక్కువగా తల్లిలాగే ఉంటారని, ఆయన తల్లి ఓ విదేశీయురాలు కాబట్టి ఆయన ప్రధాని అయ్యే అవకాశమే లేదని అనడం గమనార్హం. బీఎస్పీ నేత
వ్యాఖ్యలపై స్పందించడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు నిరాకరించారు. అయితే జై ప్రకాశ్‌ వ్యాఖ్యలపై మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జై ప్రకాశ్‌ సింగ్‌ను పార్టీ జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తొలగించారు. జై ప్రకాశ్‌ వ్యాఖ్యలు బీఎస్పీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఇతర పార్టీల నాయకులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దని మాయావతి అన్నారు. ఆయన వ్యాఖ్యలు కేవలం ఆయన అభిప్రాయం మాత్రమేనని, పార్టీకి సంబంధం లేదని చెప్పారు. వెంటనే ఆయనను పార్టీ పదవి నుంచి తొలగించామని చెప్పారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై రాజ్యసభ భాజపా ఎంపీ అనిల్‌ బలౌనీ స్పందించారు. ‘ప్రధాని కావాలని ఎవరైనా కలలు కనొచ్చు.. లోక్‌సభలో 44 సీట్లు ఉన్న రాహుల్‌ గాంధీ కలలు కనొచ్చు. ఒక్క సీటు కూడా లేని మాయావతి లాంటి వాళ్లు కూడా కలలు కనొచ్చు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.