రోడ్డుపై బ్యాలెట్‌ బాక్స్‌..ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌

జైపూర్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):  రాజస్థాన్‌లోని బరాన్‌ జిల్లాలో ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కిషన్‌గంజ్‌ నియోజకవర్గంలోని షాహాబాద్‌లో బ్యాలెట్‌ యూనిట్లను స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలిస్తుండగా.. ఒక బ్యాలెట్‌ యూనిట్‌ రోడ్డుపై పడిపోయింది. బ్యాలెట్‌ యూనిట్‌ రోడ్డుపై పడిపోయి ఉండటాన్ని గమనించిన పోలీసులు.. దాన్ని ఆ తర్వాత స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. రాజస్థాన్‌లో పోలింగ్‌ ముగిసిన వేళ.. ఓ బ్యాలెట్‌ బాక్స్‌ రోడ్డుపై పడి ఉండడం చర్చనీయాంశమైంది. కిషన్‌గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని షాహబాద్‌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రహదారిపై ఉన్న బ్యాలెట్‌ యూనిట్‌ను పోలీసులు పరిశీలించారు. ఎన్నికల సంఘం సీల్‌ వేసి ఉండడంతో ఈవీఎంలను వాహనాల్లో తరలించేటప్పుడు పడిపోయి ఉంటుందని భావించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులు అబ్దుల్‌ రఫీక్‌, నవల్‌ సింగ్‌ పట్వారీలను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారని తెలిపింది. పోలింగ్‌ తరవాత  ఆ బ్యాలెట్‌ను పోలీసులు కిషన్‌గంజ్‌లో మిగతా ఈవీఎంలు నిల్వ ఉంచిన స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. రాజస్థాన్‌ ఎన్నికల చరిత్రలోనే శుక్రవారం అత్యధికంగా 72.7 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 200 స్థానాలకు గానూ 199 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా.. అల్వార్‌ నియోజకవర్గానికి చెందిన బీఎస్పీ అభ్యర్థి లక్ష్మణ్‌ సింగ్‌ మరణించడంతో అక్కడ ఎన్నికలను వాయిదా వేశారు. శుక్రవారం సాయంత్రం వెలువడ్డ ఎగ్జిట్‌ పోల్స్‌.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కే ఎక్కువ సీట్లు వస్తాయని వెల్లడించాయి.
ఎన్నికల విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఇద్దరు అధికారులపై వేటు పడింది. రాజస్థాన్‌లో 200 శాసనసభ స్థానాలుండగా 199 నియోజకవర్గాలకు నిన్న పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. 11న ఇక్కడా కౌంటింగ్‌ జరగనుంది.