లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికలపై ఇసి కసరత్తు

జూన్‌3తో ముగియనున్న లోక్‌సభ కాలపరిమితి

వివిధ దశల్లో ఎన్నికలకు పరిశీలన

న్యూఢిల్లీ,జనవరి18(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల తేదీలను మార్చి నెల మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశాలున్నాయి. ఈ ఏడాది జూన్‌ 3వ తేదీన లోక్‌సభ గడువు ముగియనుంది. దీంతో ఆలోగా ఎన్‌ఇనకల ప్రక్రియ పూర్తి చేయాల్సిన బాధ్యత ఇసిపై ఉంది. అయితే ఎన్ని దశల్లో, ఎన్ని నెలల్లో ఆ ఎన్నికలను నిర్వహించాలన్న కోణంలో ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తుంది. భద్రత ఎంత వరకు అవసరమన్న దానిపై సమాలోచనలు చేస్తున్నట్లు కొన్ని వర్గాలు వెల్లడిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ రద్దు అయిన కారణంగా.. మరో ఆరు నెలల్లో అక్కడ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్నది. కశ్మీర్‌కు ఎక్కవ స్థాయిలో భద్రత అవసరం కాబట్టి, ఆ రాష్ట్ర ఎన్నికలను లోక్‌సభ కంటే ముందే చేపట్టే ఛాన్సుంది. సిక్కీం అసెంబ్లీ మే 27న ముగియనున్నది. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ అసెంబ్లీలు జూన్‌ 18, జూన్‌ 11, జూన్‌ 1వ తేదీల్లో ముగియాల్సి ఉంది. 2004లో కేంద్ర ఎన్నికల సంఘం.. ఫిబ్రవరి 29న లోక్‌సభ తేదీలను ప్రకటించింది. నాలుగు దశల్లో ఆ ఎన్నికలు సాగాయి. ఏప్రిల్‌ 20 నుంచి మే 10 వరకు ఆ ఎన్నికలను నిర్వహించారు. ఇక 2009లో మార్చి 2వ తేదీన లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించారు. అయిదు దశల్లో ఆ ఎన్నికలు సాగాయి. ఏప్రిల్‌ 16 నుంచి మే 13 వరకు వాటిని నిర్వహించారు. ఇక 2014లో లోక్‌సభ ఎన్నికలను మార్చి 2వ తేదీన ప్రకటించారు. అయిదు దశల్లో వాటిని చేపట్టారు. ఏప్రిల్‌ 16 నుంచి మే 13 వరకు ఆ ఎన్నికలను నిర్వహించారు.