లోక్‌సభలో తెదేపా ఎంపీలకు షాక్‌

– సభ నుంచి సస్పెండ్‌చేసిన స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌
– నాలుగు రోజుల పాటు సస్పెన్షన్‌
న్యూఢిల్లీ, జనవరి3(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ కు ప్రత్యేక¬దా ఇవ్వాలంటూ ఆందోళనకు దిగిన టీడీపీ లోక్‌ సభ సభ్యులకు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ షాకిచ్చారు. తమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని చెప్పినా వినకపోవడంతో కొరడా ఝుళిపించారు. పార్లమెంటులో12 మంది టీడీపీ సభ్యులను నాలుగు రోజుల పాటు సస్పెండ్‌ చేస్తూ గురువారం ఆదేశాలు జారీచేశారు. టీడీపీ నేతలు గల్లా జయదేవ్‌, మురళీ మోహన్‌,
రామ్మోహన్‌ నాయుడు, తోట నరసింహం, బుట్టా రేణుక, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాగంటి బాబు, శ్రీరామ్‌ మాల్యాద్రి, అశోక్‌ గజపతి రాజు, కొనకళ్ల నారాయణ, జేసీ దివాకర్‌ రెడ్డిపై స్పీకర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. సస్పెన్షన్‌ నేపథ్యంలో సభ నుంచి బయటకు వెళ్లాలని కోరగా అందుకు టీడీపీ నేతలు నిరాకరించారు. లోక్‌ సభలోనే తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తొమ్మిది మంది అన్నాడీఎంకే సభ్యులనుసైతం స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఈ సందర్భంగా తెదేపా ఎంపీలు మాట్లాడుతూ.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆందోళన చేస్తున్న తమను సభ నుంచి సస్పెండ్‌ చేయడం దారుణమని మండిపడ్డారు.  ఏపీకి న్యాయం చేసే విషయంపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని, అప్పటి వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని ఎంపీలు తేల్చి చెప్పారు. సభ ప్రారంభానికి ముందు టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌ భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేక ¬దా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఏపీ పట్ల కేంద్రం వివక్షతను ప్రదర్శిస్తుందని, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన చేశారు. ప్రత్యేక ¬దా అడిగినందుకు ఏపీలోని పారిశ్రామిక వేత్తలు, టీడీపీ నేతలపై ఐటీదాడులకు దిగుతుందని విమర్శించారు. కేంద్రం దిగివచ్చి ఏపీకి ప్రత్యేక ¬దా ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని టీడీపీ సభ్యులు పేర్కొన్నారు.
ఈరోజే ఎందుకు సస్పెండ్‌ చేశారు? – సుజనా చౌదరి
ఆంధప్రదేశ్‌ విభజన హావిూలపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు పోరాటం చేస్తుంటే ఇన్ని రోజులు నుంచి సస్పెండ్‌ చేయకుండా కేవలం ఈ రోజే (గురువారం) ఎందుకు సస్పెండ్‌ చేశారని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ప్రశ్నించారు. సస్పెన్షన్‌కు గురైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ వాళ్ళ సిద్ధాంతాలను ధిక్కరించి ముందుకు వెళ్తే సభలో మాట్లాడకుండా చేస్తున్నారని విమర్శించారు. ఏపీకి నిధులు అడగడానికి తమకు హక్కు లేదా? అని నిలదీశారు. బీజేపీ అధికారంలో ఉంటే ఈరోజు ఏపీకి జరిగిన విధంగానే రేపు అన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. మోదీ నియంతృత్వానికి, ఆ పార్టీ నేతలు వ్యవరిస్తున్న తీరుకు నిదర్శనమని సుజనా చౌదరి పేర్కొన్నారు.