లోక్‌సభ ఎన్నికల్లో తమదే విజయం

– అసెంబ్లీ ఎన్నికలు వేరు.. లోక్‌సభ వేరు..
– మూడు రాష్ట్రాల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై పడదు
– లోక్‌సభ ఎన్నికల్లో శివసేనతో కలిసే ముందుకెళ్తాం
– భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా
ముంబయి, డిసెంబర్‌19(జ‌నంసాక్షి) : లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ భాజపానే అధికారంలోకి వస్తుందని, ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో ఓటమి ఆ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపదని భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. ముంబయిలో జరిగిన ఓకార్యక్రమంలో అమిత్‌షా పాల్గొని మాట్లాడారు.. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఒక్క రాష్ట్రంలోనూ భాజపా విజయం సాధించలేకపోవటంపై అమిత్‌షా స్పందించారు. ఈ ఫలితాలు వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశమేలేదని అన్నారు. ‘రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌’ ఎన్నికల ఫలితాలు భాజపాకు అనకూలంగా రాలేదన్నది నిజమేనని, అయితే వాటిని 2019 లోక్‌సభ ఎన్నికలకు ముడిపెట్టడం సరికాదని అమిత్‌షా అన్నారు. రాష్ట్రాల ఎన్నికలు.. లోక్‌సభ ఎన్నికలకు వ్యత్యాసం ఉంటుందని అన్నారు. ఆ రెండు ఎన్నికలను పోల్చకూడదన్నారు. వేర్వేరు అంశాలపై అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్నారు. ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తామని,  వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మేం విజయం సాధించడం భాజపాకే కాదు ఈ దేశానికి కూడా ఎంతో అవసరం అమిత్‌షా అన్నారు. 2014లో కేవలం ఆరు రాష్ట్రాల్లోనే భాజపా ప్రభుత్వం అధికారంలో ఉందన్న అమిత్‌షా,  ఇప్పుడు 16 రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిందని గుర్తుచేశారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అర్థమవుతుందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీలపై అమిత్‌ షా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల మహాకూటమి ఎంతోకాలం నిలువలేదని, అది కేవలం వారి భ్రాంతి మాత్రమేనని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో శివసేనతో కలిసి పనిచేస్తామని.. ఈ విషయమై ఇప్పటికే ఆ పార్టీతో చర్చలు జరుపుతున్నామని షా వెల్లడించారు.