వరి పత్తి మిర్చి పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

టేకులపల్లి,ఆగస్టు 29( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలో గొల్లపల్లి క్లస్టర్ పరిధి లో పంటల నమోదు కార్యక్రమాన్ని వ్యవసాయ సహాయ సంచాలకులు వాసవి రాణి మంగళవారం పర్యవేక్షించారు. బొమ్మనపల్లి,కొత్త తండా,బిల్లుడు తండా,మంగ్య తండా గ్రామాలలో వరి, ప్రత్రి,మిరప పంటలను పరిశీలించి తగు సూచనలను ఇచ్చారు. మిరప లో ఎండు తెగులు గమనించడం జరిగిందని నివారణకు ఒక లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ లేదా 5 గ్రాముల ట్రైకోడెర్మా పొడిని కలుపుకొని ఆ ద్రావణాన్ని మొక్కల మొదళ్లు తడిచేటట్లు పోయాలి. పశువుల ఎరువును వినియోగించుకోవాలని సూచించారు. పోటాష్ ఎరువును వాడటం ద్వారా పంట వ్యాధి నిరోధక శక్తి ని పెంచాలని తెలిపారు. వరి పైరు లో ఆకు మచ్చ నివారణకు సూడోమోనస్ 5గ్రాములు ఒక లీటర్ నీటికి చోప్పున కలుపుకొని పిచికారి చేయాలి.విధిగా వేప నూనె పిచికారి చేయడం ద్వారా పైరుల పై వచ్చే పురుగులను అదుపులో ఉంచవచ్చు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారి జె.భాగ్య శ్రీ, రైతులు పాల్గొన్నారు.