వసతి గృహంలో బాలికలపై వికృత చేష్టలు

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనలు
మహిళా కమిషన్‌ సభ్యుల తనిఖీల్లో వెల్లడైన నిజాలు
న్యూఢిల్లీ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): బీహార్‌ ఘటనలు మరవక ముందే రాజధాని ఢిల్లీలో కూడా ఓ వసతి గృహంలో బాలికల దుస్థితి బయటపడింది. ఓ వసతిగృహంలో బాలికలపై నిర్వాహకుల వికృత చర్యలు ఆలస్యంగా వెలుగులోకొచ్చాయి. దిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఉన్న బాలికల వసతిగృహంలో తాజాగా
దిల్లీ మహిళా కమిషన్‌  సభ్యులు సాధారణ తనిఖీలు చేపట్టగా ఈ విషయం బయటపడింది. 6 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఆ బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై డీసీడబ్ల్యూ నిర్ఘాంతపోయే విషయాలు వెల్లడించింది. వసతిగృహంలో సిబ్బంది తమ పట్ల దారుణంగా ప్రవర్తించేవారని బాలికలు వాపోయారు. చిన్న తప్పు చేసినా తమ అంతర్గత భాగాల్లో వసతిగృహంలోని మహిళా సిబ్బంది కారంతో దాడి చేశారని కొందరు బాలికలు చెప్పారు. బాలికలు ఎదురు చెబితే కఠినంగా శిక్షిస్తున్నారని, ఇలా చేస్తేనే వారు తమకు లొంగి ఉంటారని, చెప్పింది వింటారని సిబ్బంది భావిస్తున్నారని మహిళా కమిషన్‌ తెలిపింది.
‘వసతిగృహంలో 22 మంది సిబ్బంది ఉన్నారు. అమ్మాయిలతో నిర్వాహకులు బట్టలు ఉతికించడం, వంట పాత్రలు కడిగించడం, గదులను శుభ్రం చేయించడం, బాత్రూమ్‌లు కడిగించడం వంటి చర్యలకు కూడా పాల్పడుతున్నారు. అలాగే, అందులో ఒకే ఒక్క వంటమనిషి ఉన్నారు. సరైన ఆహారం కూడా అందించట్లేదు. గదులను శుభ్రంగా ఉంచకపోయినా, సిబ్బందికి ఎదురు చెప్పినా బాలికలను బాగా కొట్టేవారు. ఎండకాలం, సెలవు రోజుల్లో బాలికలను ఇంటికి కూడా పంపేవారు కాదని మహిళా కమిషన్‌ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే వారు బాలికల పరిస్థితిని డీసీడబ్ల్యూ అధ్యక్షురాలు స్వాతి మలివాల్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె కూడా ఆ వసతిగృహానికి వెళ్లి ఆరా తీశారు. అనంతరం ఆమె బాలికల పరిస్థితిని ద్వారకా డీసీపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన కొందరు సీనియర్‌ పోలీసు అధికారులను ఆ వసతిగృహానికి పంపారు. మహిళా కమిషన్‌ ఫిర్యాదుతో ఆ వసతిగృహ నిర్వాహకులపై దర్యాప్తు చేపట్టారు. ఆ బాలికలకు రక్షణగా మహిళా కమిషన్‌ అధ్యక్షురాలితో పాటు సభ్యులు వసతిగృహంలోనే కొన్ని గంటలు ఉండి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.