వాహనదారులకు ఊరట!

– గుజరాత్‌లో ట్రాఫిక్‌ జరిమానాలు తగ్గింపు
గాంధీనగర్‌, సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) : గుజరాత్‌ ప్రభుత్వం వాహనదారులకు కొంత ఊరట కల్పించింది. ట్రాఫిక్‌ జరిమానాలను తగ్గింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త ట్రాఫిక్‌ చట్టం ప్రకారం వాహనదారులకు భారీ జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే బీజేపీ పాలిత రాష్టాల్రు మాత్రమే ఇప్పటి వరకు ఆ రూల్స్‌ను అమలు చేస్తున్నాయి. ఇంకా కొన్ని రాష్టాల్రు కొత్త ట్రాఫిక్‌ ఉల్లంఘన చట్టాన్ని అమలు చేయడంలేదు. బీజేపీ పాలిత గుజరాత్‌ రాష్ట్రం.. ట్రాఫిక్‌ జరిమానాలను తగ్గించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం విజయ్‌ రూపానీ తెలిపారు. హెల్మట్‌ లేకుండా వాహనం నడిపిస్తే.. కొత్త చట్టం ప్రకారం వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. కానీ గుజరాత్‌లో ఇక నుంచి కేవలం 500 రూపాయిలు మాత్రమే జరిమానా వేయనున్నారు. పాత చట్టం ప్రకారం మాత్రం కేవలం వంద మాత్రమే వసూల్‌ చేసేవారు. పిలియన్‌ రైడర్‌కు హెల్మట్‌ లేకుంటే వెయ్యి జరిమానా విధించాలి. కానీ ఇప్పుడు ఆ రూల్‌ను గుజరాత్‌ అమలు చేయడం లేదు. డిజీలాకర్‌ యాప్‌లో ఉన్న డ్రైవింగ్‌ లైసెన్సు, ఇతర డాక్యుమెంట్లను ట్రాఫిక్‌ అధికారులకు చూపించవచ్చు అని సీఎం తెలిపారు. సీటు బెల్టు పెట్టుకోని కారు డ్రైవర్లకు 500 జరిమానా విధించనున్నారు. సెప్టెంబర్‌ 16వ తేదీ నుంచి కొత్త జరిమానా పద్దతులు అమలులోకి రానున్నట్లు సీఎం రూపానీ తెలిపారు.