వికలాంగులకు ప్రోత్సాహం ఇవ్వాలి

వివిధ రంగాల్లో ప్రాధాన్యం పెరగాలి
న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5(జనం సాక్షి ): వికలాంగుల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించడం లేదు. అనవసరంగా వారిని దూరం పెట్టే ప్రయత్నాలు మంచిది కాదు. విద్యతో పాటు వివిధ రంగాల్లో వారికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వారిలో ఆత్మస్థయిర్యాన్ని పెంచాలి. హక్కుల చట్టం, 2016లో దివ్యాంగుల  విద్యకి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. భారత పునరావాస చట్టం దివ్యాంగుల విద్యా బోధకులను దేశ వ్యాప్తంగా తమ జాతీయ సంస్థల ద్వారా తయారు చేస్తుంది. కానీ వీటి ప్రస్తావన ముసాయిదాలో గుర్తించబడలేదు. ఈ రెండింటిలో విద్యపై గణనీయమైన విభాగాలు ఉన్నాయి. విచిత్రమేమిటంటే, ఉనికిలో లేని వికలాంగుల చట్టం, 1995 గురించి ప్రస్తావించింది.భారత ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకురాబోతుంది. దీనికి కేంద్ర మానవ వనరుల శాఖ ఒక కమిటీని ఇస్రో మాజీ చైర్మన్‌ డా. కస్తూరి రంగం ఆధ్వర్యంలో ఒక ముసాయిదాని మంత్రిత్వ శాఖకి సమర్పించింది, దీనిపై దేశ ప్రజలు, విద్యావంతులు, అధ్యాపకులు, ఉపాధ్యాయుల నుండి అభిప్రాయసేకరణ చేస్తుంది. ఈ ముసాయిదాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య కోసం పెద్దగా ఏమి చేర్చలేదు. దివ్యాంగులను ఎస్సీ, ఎస్టీ, ఓబిసిలు, ముస్లింలు, వలసదారుల పిల్లలు మరియు పట్టణ పేదలతో చేర్చారు. అందువలన దివ్యాంగులకు విద్యాపరమైన అవకాశాల కొరకు ‘ప్రాతినిధ్యం లేని సమూహం’ క్రింద చేర్చారు. కానీ దివ్యాంగుల విద్యా అవకాశాల గురించి గత మూడు దశాబ్దాలుగా పెద్దగా చర్చకు నోచుకోలేదు. దివ్యాంగుల సాధికారం కొరకు అనేక చట్టాలు చేసినప్పటికీ వారికీ విద్యా పరమైన విధానంలో ఆ చట్టాలను గమనంలోనికి ఇంతవరకు తీసుకోలేదు. ఎలిమెంటరీ స్థాయి విద్య గురించి ప్రస్తావించి, మాధ్యమిక, ఉన్నత విద్యలో వికలాంగులను విస్మరించింది. వికలాంగుల హక్కుల చట్టం, 2016 లో అనేక నిబంధనలు ఉన్నప్పటికీ, ఇక్కడ యాక్సెస్‌
కేవలం ర్యాంప్‌లు, హ్యాండ్‌ రెయిల్స్‌ మరియు మరుగుదొడ్ల సదుపాయాల కేవలం భౌతిక అవసరాల గురించి మాత్రమే ప్రస్తావించి, ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం, దివ్యాంగులకు అనుకూలంగా పాఠ్యాంశాల మార్పు, సహా పాఠ్య కార్యక్రమాల మార్పు, ఉపాధ్యాయుల శిక్షణ, బోధనాభ్యసన పరికరాలు, దివ్యాంగులకు ఉపకరణాలు, పునరావాస విభాగాలు మొదలైనన అంశాలను విస్మరించింది. వివిధ సమూహాలలో, పాఠశాల పిల్లలలో అత్యధిక సంఖ్యలో, వైకల్యాలున్న పిల్లలు ఉన్నారు. ముసాయిదా వికలాంగ పిల్లల నమోదును పెంచడానికి ఎటువంటి ఖచ్చితమైన చర్యలను ఇవ్వలేదు. దీనికి విరుద్ధంగా, విద్యా హక్కుల చట్టంలో అందించిన అట్టడుగు వర్గాలకు 25 శాతం రిజర్వేషన్లను తొలగించాలని ఈ విధానం ప్రతిపాదించింది. సంప్రదింపుల పక్రియ తర్వాత ముసాయిదా తయారు చేయబడిందని పేర్కొన్నప్పటికీ, ఈ పక్రియలో పాల్గొన్న వికలాంగుల కొరకు పనిచేసే నోడల్‌ మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, వికలాంగుల సాధికారత విభాగం, నేషనల్‌ ట్రస్ట్‌, భారత పునరావాస సంస్థ  జాబితాలో లేవు. విద్యారంగంలో పనిచేసే అన్ని అర్హత గల నిపుణులు మరియు సిబ్బంది యొక్క కేంద్ర పునరావాస రిజిస్టర్‌ను నిర్వహించడం’ తప్పనిసరి చేసిన భారత పునరావాస మండలి కూడా జాబితాలో లేదు.