విద్యార్థినులతో పొలం పనులు

రాంచిలో హెడ్‌మాస్టర్‌ నిర్వాకం

రాంచీ,నవంబర్‌ 28(జనంసాక్షి): పాఠశాల విద్యార్థినులతో పొలం పనులు చేయించుకుంటున్న ఓ హెడ్‌మాస్టర్‌ నిర్వాకం ఆలస్యంగా వెలుగు చూసింది. పాఠశాల ముగిశాక హెడ్‌మాస్టర్‌ ఆదేశం మేరకు బాలికలు పొలంలో పని చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు గుర్తించారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీకి 80 కిలోవిూటర్ల దూరంలోని విజయ్‌గిరి ప్రాంతంలో తామర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సోమవారం సాయంత్రం అటు వైపుగా వెళ్తుండగా ఈ విషయాన్ని గమనించారు. విజయ్‌గిరిలోని సెయింట్‌ ఇగ్నిట్యుస్‌ హై స్కూల్‌కు చెందిన బాలికలు పంటను కోస్తున్నారు. వారంతా మైనర్‌లు. వెంటనే అతను వాహనాన్ని ఆపి పొలంలో ఎందుకు పనిచేస్తున్నారని వారిని ప్రశ్నించగా.. స్కూలు అయిపోయాక తన తండ్రి పొలంలో పని చేయాలని హెడ్‌మాస్టర్‌ ఆదేశించారని బాలికలు తెలిపారని ఎమ్మెల్యే వెల్లడించారు. ఎమ్మెల్యే వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు. బాలికలను ప్రశ్నించిన అధికారులు ప్రధానోపాధ్యాయుడే ఈ పనులు చేపిస్తాని చెప్పారు. ఆదర్శంగా నిలవాల్సిన ప్రధానోపాధ్యాయుడే ఈ పనులు చేయడం గమనార్హం. విద్యార్థినులతో పని చేయించడం.. బాల కార్మిక చట్టం ప్రకారం నేరమని వారు చెప్పారు.దింతో జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయుణ్ని మందలించారు. భవిష్యత్తులో ఇలాంటి ఫిర్యాదు మళ్లీ వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను ప్రధానోపాధ్యాయుడు ఖండించారు. అది ఒక గ్రావిూణ ప్రాంతమని, అందువల్ల బాలబాలికలంతా స్కూలు ముగిశాక పొలంపనుల్లో పాల్గొని తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటారని వెల్లడించారు. తమ పొలంలో పనిచేసేందుకు బాలికలు తమకుతాముగా ముందుకొచ్చారని, ఇందులో బలంవంతమేవిూ చేయలేదని స్పష్టం చేశారు.